శరద్ పూర్ణిమ వేళ తాజ్‌మహల్ అందాలు.. పౌర్ణమి వెన్నెల్లో వజ్రంలా మెరిసే ‘చమ్కీ’ రహస్యమిదే!
శరద్ పూర్ణిమ రోజు నిండు పున్నమి వెన్నెల్లో పాలరాతి సౌందర్యంతో మెరిసిపోయే తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ రోజు ఈ చారిత్రక కట్టడాన్ని రాత్రివేళ సందర్శించేందుకు అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ టికెట్లు అన్ని ఇప్పటికే బుక్ ఐపోయాయి. ఆధ్యాత్మిక విశ్వాసాలు, వెన్నెల అందాలు కలగలిసిన ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.

ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పౌర్ణమి నాడు జరుపుకునే శరద్ పూర్ణిమకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఈ పర్వదినాన ఆకాశంలో నిండు చంద్రుడు, చల్లని పాలవెన్నెల ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఈ రోజున దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఆగ్రాలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు పర్యాటకులు తెగ పోటీ పడుతున్నారు. తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ తాజ్‌మహల్‌పై చంద్రకాంతి పడినప్పుడు ఆ కట్టడం మరింత సుందరంగా కనిపిస్తుంది. ఈ టైంలో కనిపించే అద్బుత దృశ్యాన్ని తిలకించేందుకు, అనుభూతిని పొందేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. దీంతో ఆ రోజు అందుబాటులో ఆన్‌లైన్ టికెట్లు అన్ని ఇప్పటికే పూర్తిగా బుక్ అయ్యాయి.
రాత్రి 8 గంటల నుంచి సందర్శన
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రతి పౌర్ణమి రోజుతో పాటు దానికి ముందు రెండు రోజులు, తర్వాత రెండు రోజులు పాటు నైట్ టైం తాజ్‌మహల్ సందర్శనకు అనుమతిస్తారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మొత్తం ఎనిమిది స్లాట్లలో పర్యాటకుల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో స్లాట్‌లో దాదాపు 50 మంది పర్యాటకులను లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
టికెట్లు దొరకలేదా? మరో అవకాశం!
శరద్ పూర్ణిమ సందర్భంగా తాజ్‌మహల్ చూసేందుకు టికెట్లు లభించని పర్యాటకులు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆగ్రాలోని మెహతాబ్ బాగ్ వద్ద ఉన్న తాజ్ వ్యూ పాయింట్ నుంచి కూడా వెన్నెల్లో తాజ్‌మహల్ అందాలను వీక్షించవచ్చు. నిండు చంద్రుడి కాంతిలో తెల్లని పాలరాతి కట్టడం మెరిసిపోతూ కనిపించే దృశ్యం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఫొటోగ్రఫీపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి కూడా ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది.
శరద్ పూర్ణిమకు ఆధ్యాత్మిక విశిష్టత
హిందూ సంప్రదాయం ప్రకారం, శరద్ పూర్ణిమ రోజున చంద్రుడు తన పదహారు కళలతో సంపూర్ణంగా ప్రకాశిస్తాడని విశ్వసిస్తారు. ఈ రాత్రి వెన్నెలకు అమృతతుల్యమైన శక్తులు ఉంటాయనే నమ్మకం కూడా అనేక ప్రాంతాల్లో ఉంది. ఈ సందర్భంగా చాలామంది ఇళ్లలో పాయసం లేదా ఖీర్ తయారు చేసి వెన్నెలలో ఉంచుతారు. మరుసటి రోజు దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
