పక్కనే గోదావరి.. అయినా నీళ్లు లేవు..! బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సెలవులు పొడిగింపు
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కొరత కారణంగా దసరా సెలవులను నవంబర్ 17 వరకు పొడిగించారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. నీటి సరఫరా సమస్య, సవరించిన అకాడమిక్ షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి.

ఎల్‌నినో ఇబ్బందులు తరుముకొస్తున్నాయి. తీవ్రవర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. నదులు కూడా చుక్కనీరు లేక వెలవెలపోతున్నాయి. ఇప్పుడివే పరిస్థితులు గోదావరిలోనూ నెలకొన్నాయి. ఫలితంగా.. ఎల్‌నినో కష్టాలు మొదలవుతున్నాయనే వార్నింగ్ బెల్ మోగుతోంది. దీనికి తగ్గట్టే.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి ఎల్‌నినో ప్రభావం నీటి కష్టాలు తెచ్చింది. బాసర ట్రిపుల్‌లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గోదావరి నుంచి ట్రిపుల్ ఐటీకి వాటర్ సప్లయ్ చేసే ఇన్‌టేక్ వెల్ దగ్గర మూడు మోటార్లు పాడవడంతో సమస్య తలెత్తింది. మోటార్లు పనిచేయకపోవడంతో.. క్యాంపస్‌కు నీటి సరఫరా నిలిచిపోయింది. విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.
అదేసమయంలో.. నెల రోజుల పాటు నీటి సరఫరా జరిగే అవకాశం లేదని మిషన్ భగీరథ బృందం స్పష్టం చేసింది. దీంతో.. ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను నవంబర్ 17 వరకు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అయితే.. విద్యార్థుల అకాడమిక్ ఇయర్‌కు నష్టం కలగకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఈ క్రమంలోనే.. 26వ తేదీ నుంచి నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించనున్నట్టు బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం ప్రకటించింది. అలాగే.. 2026-27 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు సంబంధించి సవరించిన అకాడమిక్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. మొత్తంగా.. బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సరఫరా నిలిచిపోవడంతో ఏకంగా వచ్చే నెల 17వరకు సెలవులు పొడిగించడం చర్చనీయాంశం అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
