Chicken Prices: ఆదివారం నాడు మాంసం ప్రియులకు చేదువార్త.. ఒకేసారి షాకిచ్చిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..
మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎగబాకుతున్నాయి. పండుగ సీజన్ క్రమంలో ఈ నెల ప్రారంభం నుంచి ధరలు మెల్లమెల్లగా పుంజుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.300కి చేరుకుని షాకిచ్చాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశముందని పాల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

పండుగ సీజన్ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. చికెన్ ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు మరింతగా పెరిగాయి. వరుస పండుగల కారణంగా చికెన్ ధరలు అమాంతం ఎగబాకుతున్నాయి. ఇది మాంసం ప్రియులకు చేదువార్తగా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా పెరగనున్నాయనే వార్తలు వినియోగదారులను మరింత కలవరపెడుతున్నాయి. చికెన్ ధరలు పెరగడానికి పౌల్ట్రీ ఉత్పత్తి, సరఫరాలో మార్పులు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పండగల సీజన్‌లో డిమాండ్ పెరగడం కూడా ధరలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. చికెన్‌తో పాటు సామాన్యులకు అందుబాటులో ఉంటే కోడిగుడ్ల ధరలు కూడా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఇవే..
ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో ఒక కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.290 నుంచి రూ.300 మధ్య లభిస్తోంది. ఇక డ్రస్స్‌డ్ చికెన్ రేటు రూ.262గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.169, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.142 వద్ద కొనసాగుతోంది. ఇక కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాల్లో కిలో చికెన్ రూ.300కి విక్రయిస్తున్నారు. తెలంగాణతో పోలిస్తేఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు మరింతగా పెరిగాయి. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.310గా పలుకుతోంది. ఇక డ్రస్స్‌డ్ చికెన్ ధర రూ.274, రిటైల్ లైవ్ బర్డ్ రేటు రూ.177, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.150గా కొనసాగుతోంది.
మరోవైపు, మటన్ ధరలు మాత్రం ప్రాంతాన్ని బట్టి గణనీయంగా మారుతున్నాయి. కిలో మటన్ ధర రూ.800 నుండి రూ.1100 వరకు పలుకుతోంది. పండుగల సీజన్ సందర్భంగా మాంసానికి భారీ డిమాండ్ ఏర్పడటంతో.. ధరలలో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే మటన్, చికెన్ సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
కోడి గ్రుడ్ల ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కోడిగ్రుడ్ల ధరలు కూడా భారీగా పెరగాయి. హైదరాబాద్ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.80గా ఉండగా.. విజయవాడ జోన్‌లో కూడా రూ.80 పలుకుతోంది. సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే కోడిగ్రుడ్ల ధరలు కూడా గత కొద్ది నెలలుగా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులు పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. అయితే పండుగల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతున్నట్లు పాల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరగే అవకాశముందని చెబుతున్నారు.
