ఇంటికో శవం.. రోజుకో మరణం.. రాత్రయితే ఆ ఊరంతా వింత శబ్దాలు, రాళ్ల దెబ్బలు.. అసలేం జరిగిందంటే.!
ఒక మూఢనమ్మకం ఆ ఊరి భవితవ్యాన్ని మార్చేసింది. ఇళ్లు వాకిలి ఖాళీ చేసేలా చేసింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ తండవాసులను ఆగం చేసింది. వరుస మరణాలతో ఉలిక్కిపడ్డ ఆ ఊరి జనం తలోదిక్కు వెళ్లిపోతున్నారు. తమను కన్నఊరు.. తాము చెమటోడ్చి కట్టిన ఇళ్లు.. కళ్ల ముందు కూలిపోతుంటే, బరువెక్కిన గుండెను రాయి చేసుకుని..
ఒక మూఢనమ్మకం ఆ ఊరి భవితవ్యాన్ని మార్చేసింది. ఇళ్లు వాకిలి ఖాళీ చేసేలా చేసింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ తండవాసులను ఆగం చేసింది. వరుస మరణాలతో ఉలిక్కిపడ్డ ఆ ఊరి జనం తలోదిక్కు వెళ్లిపోతున్నారు. తమను కన్నఊరు.. తాము చెమటోడ్చి కట్టిన ఇళ్లు.. కళ్ల ముందు కూలిపోతుంటే, బరువెక్కిన గుండెను రాయి చేసుకుని రేకుల షెడ్లలో తలదాచుకుంటున్నారు. అసలు ఇంతకీ ఆ ఊరు ఏంటి.? ఆ ఊరికి అసలేమైంది.? వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. మనిషి ఆలోచనలు అంతరిక్షాన్ని తాకుతున్నా.. అట్టడుగు భయాలు మాత్రం అలానే ఉన్నాయనడానికి కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామమే ఓ ఉదాహరణ. మనిషి ఆలోచనల్లో ఎక్కడో మిగిలి ఉన్న దెయ్యం అనే భయం ఆ గ్రామస్థులను వెంటాడగా.. పుట్టిపెరిగిన ఊరును ఒంటరిని చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. పట్టించుకునేవారు లేక ఏళ్లుగా నీడనిచ్చిన ఇళ్లు.. నిజంగానే దెయ్యాల కోటల్లా మారాయి. జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్లు.. వాటి పక్కన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలిపోయిన ఇళ్లు.. ఎవరైనా తిరిగొస్తారేమో అని ఆశగా ఎదురుచూసే వాకిళ్లు.. ఇవన్నీ దెయ్యం నేపథ్యంగా సాగే సినిమాల్లో కనిపించే సన్నివేశాలు. అయితే ఆ భావన, భయం అన్నీ రెండున్నర గంటలే. కానీ కామారెడ్డి జిల్లా గాందారి మండలం చిన్నగుట్ట తండా గ్రామానిది కొన్నేళ్లుగా ఇదే దుస్థితి. మరణం కన్నా మరణ భయమే ఆ ఊరి ప్రజలను వెంటాడగా.. ఒక్కొక్కరుగా ఇళ్లు.. వాకిలి.. వదిలి గ్రామం వెలుపలకు చేరారు. దీనికి కారణం దెయ్యం భయం. వరుసగా 10 మంది ఏ కారణం లేకుండా చనిపోవడమే ఆ భయానికి గల కారణం.
కామారెడ్డి జిల్లా గాందారి మండలం చిన్నగుట్ట తండా.. పచ్చని ప్రకృతి నడుమ ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. చుట్టూ గుట్టల నడుమ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఈ గ్రామంలో మొత్తం 50 గిరిజన కుటుంబాలుండేవి. పెంకుటిళ్ల కాలనీలతో పాటు, మూడు మంచినీటి బావులు ఉండేవి. పచ్చని ఆడవుల్లోని తమ పంట పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు ఈ తండా ప్రజలు.. కానీ కాలనీకి ఉన్నట్టుండి ఒక్కసారిగా కన్ను కుట్టింది. రాత్రి అవగానే ఇళ్ల ముందే రాళ్లు పడేవట.. మొదట చిన్న చిన్న రాళ్లు పడి.. దాని తర్వాత పెద్ద సైజు రాళ్లు పడటం మొదలయ్యాయట. వాటి దెబ్బకు చాలామందికి తీవ్రగాయాలు కూడా అయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. దాని తర్వాత ఊరిలో ఒకరు వెనుక ఒకరు 10 మంది చనిపోవడం, ఊరికి దెయ్యం పట్టిందని.. దానిని నివారణ చేస్తాననంటూ వచ్చిన ఓ బాబా కూడా అక్కడిక్కడే చనిపోవడం జరిగింది. ఇంకేముంది దీనికి దెయ్యం ఆగ్రహమే కారణమని భయపడిన గ్రామస్తులు ఊరుని మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో గ్రామంలోని 30 పెంకుటిళ్లు ఖాళీ గోడలతో దర్శనమిస్తున్నాయి అక్కడి ఇళ్లను వదిలేసి ఇప్పుడు కిలోమీటర్ దూరంలోని రేకుల షెడ్డు నిర్మించుకుని ఉంటున్నారు.
వామ్మో.! దెయ్యం.. అందుకే వచ్చేశామన్న గ్రామస్తులు..
వరుసపెట్టి తండాలో చావులు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది చనిపోయారు. పశువులు, పెంపుడు జంతువులు ఓ ముప్పై ఉంటాయి. ఒకటి తర్వాత ఒకరు చనిపోతున్నారు. దెయ్యం ఒకటే కాదు రాళ్లు పడుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్లు రాత్రయిందంటే చాలు ఇళ్లపైన పడుతూనే ఉంటాయి. తలలు కూడా పగులుతున్నాయి. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వరుసగా 9 నెలలు పడుతూనే ఉన్నాయి. ఊరికి ఏదో అయిందని అప్పటికే పూజలు, బానామతులు అన్ని అయిపోయాయి. కాని పరిస్థితి మాత్రం మారలేదు. దీంతో ఆ ఊరు ఊరునే ఖాళీ చేసేశారు. ఇక తమ కుటుంబాలలోని పెద్దలు, పిల్లలు, ఆర్థాంతరంగా చనిపోవడమే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి కారణం అంటున్నారు తండావాసులు. అకస్మాత్తుగా పడిన రాళ్లు, ఆకస్మిక మరణాలతో ఆ ఊరంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు ఊరి బయట కొందరు.. మిగిలిన తండాలకు కొందరు వలస వెళ్లిపోయారు. అక్కడ కూడ సరైన సౌకర్యాలు లేవు అని వాపోతున్నారు. ఎప్పుడు ఏ ఆడవి జంతువు వచ్చి తమను మింగేస్తుందో అనే ఆందోళనలో ఉన్నారు. అప్పుడప్పుడూ తమ పాత తండాల్లోకి వెళ్తే గుండె బరువెక్కుతోందని వాపోతున్నారు. మొత్తానికి అదృశ్య భయం తండావాసులను తలోదిక్కుకు వెళ్లేలా చేసింది. అంతు చిక్కని మరణాలతో ఉక్కిరిబిక్కిరైన తండావాసులు తలో దిక్కుకు వెళ్లి తల దాచుకున్నారు. ఇప్పుడు ఉంటున్న చోటైనా తమకు కనీస వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు.