అటు చలో మేడిగడ్డ అంటున్న కాంగ్రెస్. ఇటు చలో నల్లగొండ అంటున్న బీఆర్‌ఎస్. ఇవాళ మేడిగడ్డ సందర్శనకు రెడీ అయింది అధికార కాంగ్రెస్. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం బయలుదేరనున్నారు. ఇక కేఆర్‌ఎంబీ అంశంపై ఇవాళ నల్లగొండ సభలో మాట్లాడేందుకు రెడీ అయ్యారు గులాబీ బాస్ కేసీఆర్. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో.. ఆయన ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో కృష్ణా జలాల సాక్షిగా తెలంగాణలో జల్ దంగల్‌కు తెర లేచింది.
తెలంగాణలో వాటర్ వార్ ముదురుతోంది. మాటల యుద్ధం ముగిసింది. ఇక చేతల యుద్ధం మొదలైంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే విషయంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య అసెంబ్లీలో చర్చ, రచ్చ ముగిశాయి. దీంతో ఈ ఫైటింగ్‌లో పార్ట్-2 మొదలైంది. ఇక కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతోంది. దీనికోసం మేడిగడ్డ సందర్శనకు సిద్ధమైంది. మేడిగడ్డ సందర్శనకు వెళదామని కొద్దిరోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ సందర్శనకు రావాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన బ్యారేజ్ మేడిగడ్డ. రూ 4630 కోట్ల ఖర్చుతో మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ బ్యారేజ్‌లో పిల్లర్ నెంబర్ 16-22, భూమిలోకి 1.2 మీటర్ల మేర కుంగిపోయింది. దీంతో కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ దీన్నే బ్రహ్మాస్త్రంగా మార్చి బీఆర్‌ఎస్‌పై ప్రయోగిస్తోంది కాంగ్రెస్. దీనిలో భాగంగా మేడిగడ్డ సందర్శనకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ బృందం కాళేశ్వరం చేరుకుంటుంది. అక్కడ రెండు గంటల పాటు సైట్ విజిట్‌తో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు వీరంతా హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రుల బృందం ఇప్పటికే మేడిగడ్డను సందర్శించింది. ప్రాజెక్ట్‌లో జరిగిన నష్టాన్ని, అక్కడి పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. తాజాగా సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మేడిగడ్డకు వెళుతుండడంతో.. ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక కాంగ్రెస్ కాళేశ్వరం అస్త్రానికి విరుగుడుగా కేఆర్‌ఎంబీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది గులాబీ పార్టీ. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించి తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. దానిని ప్రజలకు వివరించేందుకు చలో నల్లగొండ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లను మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ రైతుల కోసం పోరాడేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీ అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం సాగడంతో.. ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ నల్లగొండ సభలో ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అటు అధికార కాంగ్రెస్ నేతల మేడిగడ్డ సందర్శన, ఇటు విపక్ష బీఆర్‌ఎస్ నల్లగొండ సభతో…తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..