TRS Party: కడియం శ్రీహరి టార్గెట్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య..
Warangal TRS: వరంగల్ టీఆర్ఎస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కీలక నేతల మధ్య నెలకొన్ని వైరాలు మరోసారి బహిర్గతం..
Warangal TRS: వరంగల్ టీఆర్ఎస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కీలక నేతల మధ్య నెలకొన్ని వైరాలు మరోసారి బహిర్గతం అయ్యింది. తాజాగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య నేత కడియం శ్రీహరిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన రాజయ్య.. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. పార్టీలో తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. గుంటనక్కలు గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపురం గడ్డ తన అడ్డా అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే రాజయ్య.. ఘనపురం గురించి మాట్లాడే వారికి అసలు ఇక్కడ అడ్రస్సే లేదన్నారు. ఇంకా మాట్లాడితే వారికి ఇక్కడ ఓటు హక్కు కూడా లేదని విమర్శలు గుప్పించారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని రాజయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల తరువాత అభివృద్ధిలో స్టేషన్ ఘన్‌పూర్‌ను నాలుగో స్థానంలో నిలబెట్టానని పేర్కొన్నారు. చిల్లర మల్లరగా సోషల్ మీడియాలో తనపై కామెంట్స్ చేస్తే సంగతి చెబుతానంటూ హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు బయపడే వారు ఎవరూ ఇక్కడ లేరని తీవ్ర స్వరంతో అన్నారు. అసలు సిసలైన స్థానికున్ని తానేనని ఎమ్మెల్యే రాజయ్య ఉద్ఘాటించారు.
ఇదిలాఉంటా.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరువురి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. తొలుత రాజయ్య, శ్రీహరి వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఇరువురూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఏర్పాటు తరువాత తొలి ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే రాజయ్య నేతృత్వంలోని వైద్యశాఖపై అవినీతి ఆరోపణలు రావడంతోఉపముఖ్యమంత్రి, మంత్రి పదవుల నుంచి రాజయ్యను బర్తరఫ్ చేశారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి మంత్రి పదవిని కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఆ తరువాత కొంతకాలం స్తబ్ధుగా ఉన్న రాజయ్య.. మళ్లీ రాజకీయంగా జోష్ పెంచారు. అయితే, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్ పూర్ ఎమ్మెల్యే సీటును తన కూమార్తెకు ఇప్పించేందుకు కడియం శ్రీహరి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఆయనే పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తన నియోజకవర్గంపై కడియం శ్రీహరి కన్నేయడంపై రాజయ్య భగ్గుమన్నారు. అలా అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also read: Telangana Budget Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం
Two-Day Bank Strike: సమ్మెబాట పట్టిన జాతీయ బ్యాంకులు.. సోమ, మంగళవారాల్లో బంద్..