Warangal: వరి కొనుగోళ్లపై కదం తొక్కిన గులాబీ శ్రేణులు.. వరంగల్‌లో వినూత్న నిరసన..
Paddy issue in Telangana: తెలంగాణలో వరి కొనుగోళ్లపై గత కొన్ని రోజుల నుంచి సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయమని స్పష్టంచేయడంతో.. యాసంగిలో
Paddy issue in Telangana: తెలంగాణలో వరి కొనుగోళ్లపై గత కొన్ని రోజుల నుంచి సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయమని స్పష్టంచేయడంతో.. యాసంగిలో వరి వేయొద్దంటూ ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. వరికి బదులుగా.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కోరుతోంది. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు.. వినూత్న నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. రైతులను వెంటబెట్టుకొని గులాబీ శ్రేణులు రోడ్లపై కదం తొక్కుతున్నారు. దీనిలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ శవయాత్రలు కొనసాగాయి. పాలకుర్తిలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాడెకట్టి వినూత్న రీతిలో శవయాత్ర నిర్వహించారు.
మరోవైపు ఖిలా వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ శవయాత్ర చూపరులను ఆశ్చర్యపర్చింది. ఒక మనిషి చనిపోతే ఎలా శవయాత్ర చేస్తారో.. అచ్చం అలాగే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఊరేగించారు. ఈ శవయాత్రలో పాల్గొన్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీజేపీ నాయకులు ఇండియాలో తాలిబన్లను తలపిస్తున్నారని ఆరోపించారు.
దీంతోపాటు దేవరుప్పుల మండలంలో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న నిరసనతెలిపారు. కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను శవపేటికపై పెట్టి చావుడప్పులతో అంతిమ యాత్ర నిర్వహిస్తూ వినూత్న నిరసన చేశారు. యాసంగి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read: