Watch Video: వార్నీ ఇదేంది మావా.. ఇక్కడ పేషెంట్స్ కన్నా.. ఎలుకలే ఎక్కువున్నట్టున్నాయ్‌గా..
ఓ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిపై మూషిక సేనలు దండయాత్ర చేస్తున్నాయి.. బాలింతలను హడలెత్తిస్తున్న ఎలుకలు పసిపిల్లలను రక్కి గాయపరుస్తున్నాయి.. ఇన్ పేషెంట్ వార్డులో స్వైర విహారం చేస్తూ పేషెంట్స్‌ను ఉక్కిరి బిక్కిరిచేస్తున్నాయి.. అక్కడ పరిస్థితి పేషెంట్స్ కన్న ఎలుకల సంఖ్యే అనే వరకు చేరింది. ఇంతకీ ఈ ఎలుకల గోలంతా ఎక్కడ అనుకుంటున్నారా.. తెలుసుకుందాం పదండి.

వరంగల్ నగరంలోని సికేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఇన్ పేషెంట్ వార్డులో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల ఆరోగ్యం మెరుగవడం కోసం ట్రీట్మెంట్ అందించే ఇంక్యుబేటర్ వార్డులో ఈ విధంగా మూషిక సేనలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పసిపిల్లల తల్లులు కాస్త వేమరపాటుగా ఉంటేచాలు చిన్నారులను రక్కి గాయపరుస్తున్నాయి. ఇక్కడ పసిపిల్లల ప్రాణాల కోసం బాలింతలు, వాళ్ళ అటెండెన్స్ కాపలా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలుకల బారి నుండి పసి పిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు ఈ తల్లులు.
గతంలో ఈ మూషిక సేనలు పసిపిల్లలను రక్కి గాయపరిచిన సందర్బాలు ఉన్నాయి.. బాలింతల గోర్లు కొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా హాస్పిటల్ సిబ్బందితో మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. గతంలో ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు ఏకంగా మాజీ సూపరింటెండెంట్ పోస్ట్ కి ఎసరు పెట్టాయి. చివరకు ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇన్ పేషెంట్ వార్డులో ఇంత విచ్చలవిడిగా ఎలుకలు దండుకట్టి దర్జాగా తిరుగుతున్నా.. వాటి నియంత్రణపై మాత్రం ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ఫలితంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళ బంధువులు ఈ ప్రసూతి ఆస్పత్రి పేరు చెప్తేనే గజగజ వనికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంకుబెటర్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ పసిబిడ్డ తండ్రి ఈ వాస్తవ దృశ్యాలను వీడియో తీసి మీడియా దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయం అంతా సంబంధిత అధికారులు, సి కె ఎం ప్రసూతి ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి దృష్టికి తీసుకువెళ్ళడంతో వారు స్పందించారు. ఎలుకల స్వైరవిహారం తమ దృష్టికి కూడా వచ్చింది అంటున్న సూపరిండెంట్ వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తామని.. ఎలుకల బెడద నుండి ఈ ప్రసూతి ఆసుపత్రిని రక్షిస్తామని అంటున్నారు.
శానిటేషన్ నిర్వహణ లోపమే ఎలుకల స్వైర విహారానికి ప్రధాన కారణమని.. ఆస్పత్రిలో శానిటేషన్ నిర్వహణ కోసం లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా.. అవన్నీ ఎలుకల పాలే అవుతున్నాయి. చిన్న నిర్లక్ష్యం ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తుందిని సిబ్బంది గ్రహించలేక పోతున్నారు. ఇప్పటికైనా ఈ నిర్లక్ష్యం వీడి ఎలకల బెడద నుండి ఈ ప్రసూతి ఆస్పత్రిని రక్షిస్తారని ఆశిద్దాం.
వీడియో చూడండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
