AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖమ్మంలో రక్తికడుతున్న రాజకీయం.. పువ్వాడ- తుమ్మల మధ్య మాటల యుద్ధం

వాళ్లిద్దరిది ఒకటే సామాజికవర్గం, ఇద్దరూ మొన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నవారే. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. లోకల్‌, నాన్‌ లోకల్‌, రూపాయి, డాలర్‌ అంటూ ఒకరిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇద్దరు నాయకుల మధ్య రకరకాల పోలికలతో ఖమ్మం రాజకీయం రక్తి కడుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు స్థాయి దాటి ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వరకు వెళ్లాయి.

ఖమ్మంలో రక్తికడుతున్న రాజకీయం.. పువ్వాడ- తుమ్మల మధ్య మాటల యుద్ధం
Tummala Vs Puvvada
Ram Naramaneni
|

Updated on: Nov 13, 2023 | 4:33 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం హాట్‌ సెగ్మెంట్‌గా మారింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌, కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు. ఇద్దరు పాత ప్రత్యర్థులే, పార్టీలు మాత్రమే వేరు. ప్రచారంలో భాగంగా ఇద్దరు పరస్పరం విమర్శల బాణాలు ఎక్కుబెడుతున్నారు. ఇద్దరి మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. ప్రచారం ఉధృతమవుతున్న కొద్ది ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. గతంలో పాలేరు, ఖమ్మంలో చెల్లకుండా పోయిన రూపాయి ఇప్పుడు మళ్లీ ఖమ్మం వచ్చిందని ఈ మధ్య మంత్రి పువ్వాడ అజయ్‌ తన ప్రత్యర్థి తుమ్మలపై సెటైర్లు వేశారు. తళతళలాడో కొత్త వంద రూపాయల నాణెం వంటివాడిని తానని మంత్రి పువ్వాడ అజయ్‌ అంటున్నారు.

తనను నాన్‌ లోకల్‌ అంటున్న పువ్వాడ మాటలను తుమ్మల తప్పుబట్టారు. ఆయన ఎక్కడివారో తెలుసుకుంటే మంచిదని సూచించారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంను అభివృద్ధి చేయలేదని పువ్వాడ ఆరోపించారు. ఖమ్మం ప్రజలనే కాదు, సీఎం కేసీఆర్‌ను కూడా తుమ్మల మోసం చేశారని విమర్శించారు. పువ్వాడ కామెంట్స్‌ను తుమ్మల నాగేశ్వరావు తప్పుబట్టారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా తాను గెలిచానని, ఖమ్మం నియోజకవర్గం దాటితే పువ్వాడను గుర్తు పట్టేవారే ఉండరని తుమ్మల విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, అది కళ్ల ముందే కనబడుతోందని తుమ్మల అంటున్నారు. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలో కోరుకోవాలని ఖమ్మం ఓటర్లను ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఈ విమర్శల పర్వం మరో అడుగు ముందుకు వెళ్లింది. పువ్వాడ దాఖలు చేసిన అఫిడవిట్‌ నిర్దేశించిన ఫార్మట్‌లో లేదని ఎన్నికల సంఘానికి తుమ్మల నాగేశ్వరరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పువ్వాడ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్లలో తప్పులున్నాయని అన్నారు. మొత్తానికి ఇద్దరు దిగ్గజ నేతల పోరుతో ఖమ్మం నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అత్యంత కీలక నియోజకవర్గంగా మారింది. మరి ఓట్ల జాతరలో ఓటర్లు ఏం తీర్పు చెప్తారో చూడాలి?.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.