Telangana: అయ్యో ఎంతకష్టమొచ్చే.. రోడ్డు లేక బాలింతను వీపుపై మోసుకెళ్లిన గ్రామస్థులు.. వీడియో వైరల్
ఇప్పటికీ పలు తండాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రాగా.. సరైన రోడ్డు వసతి లేక అంబులెన్స్ 2కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. చివరకు సిబ్బంది మహిళను అంబులెన్స్ వద్దకు వీపుపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సంఘటన దీనికి నిలువెత్తు నిదర్శనం. నాగలిగిద్ద మండలం శాంతినగర్ తాండ పంచాయతీలోని మునియా నాయక్ తండాకు చెందిన గిరిజనులు రోడ్డు లేకపోవడంతో ప్రతిరోజూ అవస్థలు పడుతున్నారు. ఆదివారం ఉదయం మునియా తండాకు చెందిన కౌశిబాయి అనే బాలింతకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే, తండాకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వర్షం కారణంగా దారి మరింత బురదమయంగా మారడంతో నడిచి వెళ్లడం కూడా కష్టమైంది.
ఈ విపత్కర పరిస్థితుల్లో అంబులెన్స్ ఈఎంటీ సంగ్ శెట్టి తండాకు చేరుకుని మహిళకు పురుడు పోసింది. మహిళ ఆడబిడ్డ జన్మించింది. ఆ తర్వాత బాలింతను ఆసుపత్రికి తరలించేందుకు, మరో మార్గం లేకపోవడంతో గ్రామస్థులు వీపుపై ఎత్తుకుని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వద్దకు చేర్చారు. ఆ తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తండా ప్రజల కష్టాలను మరోసారి కళ్లకు కట్టింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిత్యం ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని, కనీస సౌకర్యాల కోసం అధికారులు వెంటనే స్పందించాలని తండావాసులు కోరుతున్నారు. స్వతంత్ర భారతంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
