AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: రేవంత్ పగటివేషాలను ప్రజలు నమ్మరు.. వారిని ప్రసన్నం చేసుకోవడానికే ధర్నా.. కిషన్ రెడ్డి ఫైర్..

బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. దాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ సభ.. రాహుల్ గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని విమర్శించారు. . గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులనే.. ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుందన్నారు.

Kishan Reddy: రేవంత్ పగటివేషాలను ప్రజలు నమ్మరు.. వారిని ప్రసన్నం చేసుకోవడానికే ధర్నా.. కిషన్ రెడ్డి ఫైర్..
Kishan Reddy Fires On CM Revanth Reddy
Krishna S
|

Updated on: Aug 06, 2025 | 7:56 PM

Share

రాజ్యాంగ విరుద్ధంగా చేపట్టే మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుని తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై ఆయన స్పందించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్ పార్టీ పెట్టిన సభ.. రాహుల్ గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు.. గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్ ఈ సభ పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో ధర్నా చేస్తే.. ఎవరూ పట్టించుకోరని.. ఢిల్లీకి వచ్చి పగటివేషాలు వేస్తున్నారని ఎద్దెవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా.. మజ్లిస్ పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులనే.. ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల్ సీట్లలో ముస్లింలు పోటీ చేసి.. 50 రిజర్వ్‌డ్ సీట్లలో 31 చోట్ల గెలిచారని చెప్పారు. ఇప్పుడు అధికారికంగా 10శాతం ముస్లింలను బీసీల్లో చేర్చి 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తే.. బీసీలకు రాజ్యాధికారం కష్టమేననేది తెలంగాణ సమాజానికి అర్థమైందని వ్యాఖ్యానించారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అశాస్త్రీయమైన సర్వే చేసి, బీసీల సంఖ్యను తగ్గించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత దీనికి 10శాతం ముస్లింలను చేర్చి.. బీసీలను మోసం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని చెప్పారు. అందుకోసం న్యాయపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప.. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రణాళిక లేకుండా.. కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. 18 నెలలుగా ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాల అమలు ఊసెత్తడం లేదని విమర్శించారు. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామన్నారని.. కానీ ఇప్పటివరకు ఎంతిచ్చారని ప్రశ్నించారు.

నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి విమర్శిస్తే.. అది ఆకాశం మీద ఉమ్మేయడమేనని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నేతృత్వంలో ప్రజలకు సుస్థిరమైన పాలన అందుతోందని.. వచ్చే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ కేంద్రంలో అధికారం గురించి ఆలోచించడం మానుకోవాలని ఎద్దెవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర అవుతున్నా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి.. రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 1955లో బీసీలకు రిజర్వేషన్లకు కల్పించాలన్న కాకా కాలేల్‌కర్ కమిషన్ రిపోర్టును నెహ్రూ పక్కన పెట్టారని.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కలసి మండల్ కమిషన్ రిపోర్టును ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని విమర్శించారు. ఇలా ప్రతి సందర్భంలోనూ నెహ్రూ కుటుంబం బీసీలకు అన్యాయం చేసిందని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us