Kishan Reddy: పసిపిల్లలపై మతపరమైన రుద్దుళ్లా.. సైదాబాద్ స్కూల్ నిర్వాకంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
హోంవర్క్ పేరుతో క్లాస్-2 హిందూ విద్యార్థి చేత కల్మా చదివించేందుకు ప్రయత్నించిన ఉదంతం హైదరాబాద్‌లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్కూల్ నిర్వాకంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక చిన్నారుల మనసుల్లో మతపరమైన ఆలోచనలను జొప్పించేందుకు జరుగుతున్న బహిరంగ కుట్ర ఇదని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్ సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఉదంతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి హోంవర్క్‌లో భాగంగా మతపరమైన ప్రార్థనలు కల్మా, సూరా అల్ ఫాతిహా రాయాలని, చదవాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందనే వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి తన పోస్ట్‌లో ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘‘సైదాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో క్లాస్ 2 హిందూ విద్యార్థిని హోంవర్క్ పేరుతో కల్మా, సూరా అల్ ఫాతిహాలను చదవాలని, రాయాలని బలవంతం చేయడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది పసిపిల్లల మనసుల్లో మతపరమైన ఆలోచనలను జొప్పించేందుకు జరుగుతున్న బహిరంగ ప్రయత్నం” అని ఆయన ఆరోపించారు.
రాజకీయాల ఫలితమే: సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు
ఈ వివాదానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విషపూరిత రాజకీయాల ఫలితం కాదా ఇది?’’ అని ఆయన ప్రశ్నించారు. అమాయక విద్యార్థులపై ఇటువంటి మతపరమైన రుద్దుళ్లను సహించేది లేదని స్పష్టం చేశారు.
కఠిన చర్యలకు డిమాండ్
పాఠశాల యాజమాన్యం నిర్వాకంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. చిన్నారుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, మతపరమైన విద్వేషాలకు కారణమవుతున్న బాధ్యులపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
𝐑𝐞𝐬𝐮𝐥𝐭 𝐨𝐟 𝐏𝐨𝐢𝐬𝐨𝐧𝐨𝐮𝐬 𝐏𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬 𝐨𝐟 𝐀𝐩𝐩𝐞𝐚𝐬𝐞𝐦𝐞𝐧𝐭
Deeply shocking to know that a private school in Saidabad, Hyderabad, forced a Class 2 Hindu student to recite and write the Kalma & Surah Al-Fatiha as part of their homework. This is an open… https://t.co/6OSgMT8fNB
— G Kishan Reddy (@kishanreddybjp) July 16, 2026
