Telangana BJP: అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు.. ఈ నెల 29న తెలంగాణకు అమిత్ షా..
Minister Amit Shah: తెలంగాణ రాజకీయాలపై బీజేపీ సీరియస్ గా ఉందా ? కాషాయ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ? అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఏం చెప్పబోతున్నారు ? తెలంగాణపై బీజేపీ హైకమాండ్ లెక్కలేంటీ ? తెలంగాణపై బీజేపీ ఫోకస్.. ఈ నెల 29న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన.. సామాజిక వర్గాల ప్రముఖులతో భేటీ.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం..హైకమాండ్ సహకారంపై క్లారిటీ ఇవ్వనున్న షా..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. ఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో, జిల్లా కమిటీల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ సూచించింది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కమిటీలు వేయాలని భావిస్తున్నారు. ప్రచార కమిటీ, మ్యానిఫేస్టో కమిటీ, సోషల్ మీడియా కమిటీ, ప్రచార సభల కమిటీ ఇలా 22 కమిటీలను త్వరలోనే ప్రకటించనున్నారు. పోటీ ఎక్కువగా లేని నియోజకవర్గాల్లో ఎన్నికల పనులు ప్రారంభించుకోవాలని ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ నెల 29న ఖమ్మంలో అమిత్ షాతో భారీ బహిరంగసభకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు.
భారీ వర్షాల కారణంగా ఖమ్మం సభను వాయిదా వేశారు. అందుకు బదులుగా హైదరాబాద్ లో అమిత్ షా సామాజిక వర్గాల ప్రముఖులతో భేటీ కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఇటీవల బీజేపీ నేతలు తమ మధ్య ఉన్న లుకలుకలు బయటపెట్టుకోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పార్టీని లైన్లో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా అమిత్ షా హైదరాబాద్ రానున్నారని సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి అవసరమైన వనరులు ఏంటీ ? హైకమాండ్ నుంచి ఎలాంటి సహకారం అవసరం ? ఎంత వరకు పార్టీ అధిష్టానం సహాయం చేయగలదు ? ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలి ? ఇలాంటి అంశాలపై అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై అమిత్ షాతో చర్చించిన బండి సంజయ్ కు హైకమాండ్ నుంచి మంచి భరోసానే లభించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఏ మేరకు సర్ధుకుంటాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం