రాజకీయాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉంటారు. ఎన్నికల వేళ ఉచితాలు, కానుకలు ఇవ్వడం పరిపాటి. రాజకీయాల్లో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేతలు సద్వినియోగం చేసుకుంటారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నేతలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యువ ఓటర్లను టార్గెట్ గా చేసుకొని అక్కడి నేతలు వారికి ఉచితంగా లైసెన్సులు ఇప్పిస్తున్నారు. ఇప్పుడిది తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ గా మొదలైంది. ఆ సరికొత్త ట్రెండ్ ఏంటో.. పొలిటికల్ లీడర్లు ఇచ్చే ఉచిత లైసెన్సలు ఏమిటో తెలుసుకుందాం..
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండడంతో నేతలు, ఆశావహుల హడావుడితో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు. పేద విద్యార్థులకు నోటుబుక్స్, గ్రామాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పండుగలకు సామాగ్రి సహాయం, చనిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడంలో నేతలు పోటీ పడుతుంటారు. ప్రత్యర్థులకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలు మాత్రం నయా ట్రేండును ఫాలో అవుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటికి సిద్ధమవుతున్నారు. ఆలేరు నుంచి ఎమ్మెల్యే గుమ్మడి సునీత మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. యువతకు క్రికెట్ కిట్లు, క్రీడల సామగ్రి, యువజన సంఘాలు, కుల సంఘాల భవనాలకు నిధులు సమకూర్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను టార్గెట్ గా చేసుకొని ఈ నేతలు సరికొత్త ట్రెండు ఫాలో అవుతున్నారు. యువతకు అవసరమయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌లు, హెల్మెట్లు ఇప్పించే న్యూ ట్రెండ్ కు తెరతీశారు. డ్రైవింగ్ లైసెన్స్ కు అవసరమైన ఆధార్, జనన ధ్రువీకరణ, టెన్త్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు మాత్రమే తీసుకెళ్తే ఉచితంగా టూవీలర్, ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్సును ఇప్పిస్తామని నేతలు కరపత్రాలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వార్డుల వారిగా ప్రత్యేక మేళాలు నిర్వహించి యువకుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కు అవసరమైన వారి వివరాలు తీసుకుంటున్నారు.
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్
టు వీలర్ లెర్నింగ్ లైసెన్స్ రూ.300, పర్మనెంట్ కోసం రూ.1100 ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది. లైట్ మోటార్ వెహికిల్, టూవీలర్ కు కలిపి లర్నింగ్‌కు రూ.450, పర్మనెంట్ కోసం రూ.1350 చెల్లించాల్సి వస్తుంది. ఆర్టిఏ ఏజెంట్ తో వెళ్తే టూ వీలర్ కు అన్నీ కలిపి రూ.2,200, లైట్ మోటార్ వెహికిల్ కోసం రూ.3,500 వరకు చెల్లించాల్సిఉంటుంది. ఈ నేతలు చేపట్టిన ఈ మేళాలతో యువతకు ఈ డబ్బులు ఆదా కానున్నాయి. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి టూ వీలర్ లైసెన్స్‌లను ఉచితంగా ఇప్పిస్తానని ప్రకటిస్తే , డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి టు వీలర్, ఫోర్ వీలర్ వాహనాల డ్రైవర్లకు ఉచితం లైసెన్స్‌లు ఇప్పిస్తామని చెబుతున్నారు. యువ ఓటర్లకు తామే డబ్బులు చెల్లించి డ్రైవింగ్ లైసెన్స్లను అందిస్తామని ఇక్కడ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎన్నికల నాటికి ఈ రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరెన్ని కొత్త పందాలను అనుసరిస్తారో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..