
మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి ఆదివాసీలు అనేక కష్టాలు పడుతున్నారు. మృతదేహాన్ని తీసుకు వచ్చిన తీరు కంటతడి పెట్టిస్తోంది. చినుకు పడితే ఏజెన్సీ వాసుల్లో ఆందోళన మొదలవుతుంది. భారీ వర్షాలు కురిస్తే వాగులు ,వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. గత రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆ ఏజెన్సీ అతలాకుతలం అయ్యింది. అనేక గ్రామాల్లో రోడ్లు , చిన్న బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల తెగిపోయాయి. ఇప్పటికీ కనీసం అధికారులు ,ప్రజా ప్రతినిధులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరమ్మత్తులు చేపట్టలేదు. ఫలితంగా ఏజెన్సీలో ఆదివాసీలు అనేక కష్టాలు పడుతున్నారు. ఇక వివరాల్లోకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రాయనపేట గ్రామంలో జ్వరంతో బాధపడుతూ చనిపోయిన కొమరం లక్ష్మి మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చిన తీరు స్థానికులను కలచివేసింది.
స్థానిక పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు సొంత మండలం అయిన కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామపంచాయతీలో ఈ ఘటన జరిగింది. రాయునిపేట గ్రామంలో కొమరం లక్ష్మి గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్లడం అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. తిరిగి పోస్ట్ మార్టం అనంతరం మృతురాలు సొంత గ్రామం.. రాయనపేటకు ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తరలించేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో ఇలా మృతురాలి బంధువులు వాగులో నుంచి మృతదేహాన్ని నానా ఇబ్బందలూ పడుతూ మోసుకుంటూ వెళ్లారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా కరకగుడెం- చిరుమల్ల గ్రామాల మధ్య గల పెద్దవాగు వంతెన సగం కొట్టుకపోవడంతో రాయనపేట గ్రామానికి వెళ్ళుటకు మరో దారిలేదు. తప్పని సరిగా ఈ వాగులో నుంచి వెళ్లాలి. భారీ వర్షాలు కురిస్తే రాయనపేట , దాని చుట్టు ప్రక్కల 6 గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తాయి.
దీంతో ఆ గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మరెన్నో గ్రామాల్లో కూడ రోడ్లు సౌకర్యం లేక ఆదివాసీల బిడ్డల వారు పడుతున్న బాధలు వర్ణనానితం. దీనివలన గర్భిణీలు గాని, చంటి పిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఆరోగ్యం బాగా లేనటువంటి వారు ,స్కూల్ పిల్లలు బయటకు వెళ్లాలంటే వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు ,ఇటువంటి పరిస్థితుల్లో పాము కాటు, లేదా తేలుకుట్టినట్లు లేదా ప్రసవం సమయంలో గర్భిణి స్త్రీలు పరిస్థితి వర్ణనానీతం. ఈ ప్రాంత ప్రజలు రోడ్డు మార్గం వంతెన నిర్మాణం గురించి మొరపెట్టుకున్న కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకునే పాపాన పోలేదని అంటున్నారు. ఇకనైనా అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చొరవ తీసుకొని ఏజెన్సీలో రోడ్లు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏజెన్సీలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.