AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. ఇకపై వారికి కూడా అవకాశం..

సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. వారికి తీపికబురు అందించారు. వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు. త్వరలో జరగనున్న మున్నిపల్ ఎన్నికల్లోపు అమలు చేయాలని నిర్ణయించారు.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. ఇకపై వారికి కూడా అవకాశం..
Indiramma Houses
Venkatrao Lella
|

Updated on: Jan 12, 2026 | 5:26 PM

Share

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ సర్కార్.. అనేక కార్యక్రమాలను కొత్తగా ప్రవేశపెడుతోంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకు అనే కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ పాలనలో అవకాశం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లను కో ఆప్షన్ మెంబర్‌గా నామినేట్ చేయనున్నారు. త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నిలు జరగనున్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలలో ఓటర్ల సమగ్ర సవరణ జాబితా సిద్దం కానుండగా.. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

ట్రాన్స్‌జెండర్లకు అవకాశం

మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించేందుకు రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్లను కార్పొరేటర్‌గా కో ఆప్షన్ కేటగిరిలో నామినేట్ చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ఆ వర్గాల సమస్యలపై మాట్లాడే అవకాశం వారికి లభించనుందని తెలిపారు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేటర్‌గా అవకాశం కల్పించడం వల్ల వాళ్లే తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా కృషి చేస్తారని అన్నారు. ఇక నుంచి వారి సమస్యలను మనం ప్రస్తావించకుండా వాళ్లకే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఉద్యోగులకు జీతం కట్

సోమవారం ప్రజాభవన్‌లో దివ్యాంగులు, వృద్దుల కోసం ప్రణామ్, స్కూల్ పిల్లల సంక్షేమం కోసం బాల భరోసా అనే రెండు పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15 శాతం వరకు కోత విధిస్తామాంటూ హెచ్చరించారు. కట్ చేసిన డబ్బులను నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై కొత్త చట్టం తీసుకురానున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులపై బాధ్యత లేనివారికి సమాజంపై బాధ్యత ఉండదని, దీంతో వారిని దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అయిందని, ఇంత తక్కువ సమయంలో అద్బుతాలు చేస్తామని చెప్పడం లేదన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ పేర్కొన్నారు.