AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వామ్మో నవంబర్.. అడవుల జిల్లాలో భయం భయం.. ఎందుకంటే..?

నవంబర్‌లో కాగజ్‌నగర్ కారిడార్‌లో పులులు, చిరుతల దాడులు ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికిస్తున్నాయి. మహారాష్ట్ర నుండి వస్తున్న పులుల వల్ల పత్తి చేలల్లో పనిచేసే రైతులు, కూలీలు భయాందోళన చెందుతున్నారు. గత మూడేళ్లుగా మనుషుల ప్రాణాలు తీస్తుండగా, అటవీ శాఖ జాగ్రత్తలు సూచిస్తోంది. ఈ మానవ-వన్యప్రాణి సంఘర్షణ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Telangana: వామ్మో నవంబర్.. అడవుల జిల్లాలో భయం భయం.. ఎందుకంటే..?
Tiger And Leopard Attacks
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 18, 2025 | 7:51 PM

Share

నవంబర్‌ నెల వచ్చిందంటే చాలు అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కాగజ్‌నగర్ కారిడార్ ప్రాంతం వణికిపోతోంది. ఎప్పుడు ఏ విషాద వార్తను‌ వినాల్సి వస్తుందో అన్న ఆందోళనకు గురవుతోంది. అందుకు కారణం గత మూడేళ్లుగా ఇదే మాసంలో పులులు, చిరుతలు , చివరకు ఏనుగులు సైతం కాగజ్‌నగర్ కారిడార్‌లోకి ఎంట్రీ ఇచ్చి బీభత్సం సృష్టించడం.. రైతులను బలి తీసుకోవడం కొనసాగింది. ఈ ఏడాది సైతం కాగ‌జ్‌నగర్ కారిడార్‌లో మళ్లీ చిరుతల సంచారం.. పులుల దాడులు సాగుతుండటంతో పత్తి చేనుల్లో పని చేసేందుకు వ్యవసాయ కూలీలు వణికిపోతున్నారు. పెంచికల్ పేట, బెజ్జూర్ ప్రాంతాల వాసులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా అంటేనే వలస పెద్దపులులకు పెట్టింది పేరు. ఇక్కడ వాటి ఆవాసానికి అనువైన దట్టమైన అరణ్యాలు ఉండటమే కారణం. మహారాష్ట్ర తడోబా, అందేరి అభయారణ్యాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆవాసం కోసం సరిహద్దు దాటి కొమురంభీం జిల్లా అడవుల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అలా వస్తున్న పులులకు కాగజ్‌నగర్ కారిడార్ అనువైన ప్రాంతంగా మారుతోంది. అక్టోబర్, నవంబరు మాసాల్లో మహారాష్ట్ర రాష్ట్రం దాటి జిల్లాకు చేరుకుంటున్న పులులు.. తోడు దొరక్క ఆగ్రహంతో దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

గతేడాది ఇదే నెలలో ఎన్​-1 పులి మహారాష్ట్రలోని మాండ్వి, అంబాడి, కిన్వట్​ మీదుగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ప్రవేశించి మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసింది. బోథ్​, నేరడిగొండ, సిరికొండ, ఉట్నూరు మండలాల్లోని అటవి ప్రాంతాల గుండా సంచరిస్తూ అడ్డొచ్చిన పశువులపై దాడి చేసింది. అలా నిర్మల్​ జిల్లాలోని పెంబి, మామడ, సారంగాపూర్​ మండలాల మీదుగా కొమురంభీం జిల్లా కెరమెరి ఘాట్ల గుండా తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. అయితే ఆదిలాబాద్, నిర్మల్‌లో కేవలం పశువుల మీద దాడులు‌ చేసిన పులి.. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్‌లో మాత్రం మనుషులను కూడా టార్గెట్ చేసింది.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ మండలం మెట్​ ఇంధాని అటవీ ప్రాంతం, మహారాష్ట్ర సరిహద్దు తడోబా అభయారణ్యం తో కలిసి ఉండటంతో ఆ రాష్ట్రంలోని తడోబా అడవుల నుంచి కాగజ్​నగర్ డివిజన్​లోకి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. 2020 నుంచి తోడు కోసం పులులు అలుపెరుగని ప్రయాణం చేసి బార్డర్ దాటి జిల్లాలోజి వస్తున్నాయి. సరిగ్గా పత్తి పంట చేతికొచ్చిన సమయంలో కాగజ్ నగర్ కారిడార్ అభయారణ్యం లోకి వస్తున్న పులులు అటవీ పరిసర గ్రామాల శివారుల్లోకి చొచ్చుకొచ్చి పంట చేలల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలను పొట్టన పెట్టుకుంటున్నాయి.

గతంలో 2020 నవంబరు 11న దహేగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్​ చేపలు వేటకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన పులి అతడిపై దాడి చేసి హతమార్చిచింది. అదే నెలలో 29న పెంచికల్​పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల కుటుంబీకులతో కలిసి చేనులో పత్తి తీస్తున్న క్రమంలో బెబ్బులి వెనుక నుండి వచ్చి దాడి చేసి హతమార్చింది. 2024 నవంబర్ 29న కాగజ్​నగర్​ మండలం గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ పత్తి తీస్తుండగా పులి వెనకవైపు నుంచి పంజా విసిరి ప్రాణం తీసింది.

అదే ఏడాది ఏప్రిల్‌లో దారి తప్పి కాగజ్‌నగర్‌ కారిడార్‌లోకి వచ్చిన ఓ మదపుటేనుగు పెంచికల్ పేట, బెజ్జూర్ అడవుల్లో మూడు రోజులు సంచరించింది. చేనులో పని చేసుకుంటున్న రైతులపై దాడి చేసి చంపేసింది. చింతలమానేపల్లి మండలం బూరజ్ పల్లికి చెందిన మిర్చి రైతు అల్లూరి శంకర్, పెంచికల్ పేట మండలం కొండపల్లికి చెందిన పోశన్న అనే రైతును పొట్టన పెట్టుకుంది. తాజాగా ఇదే ప్రాంతంలో చిరుత, పులి సంచారం కలకలం రేపడంతో మళ్లీ ఏ వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో అని ఈ ప్రాంత వాసులు భయాబ్రాంతులకు గురవుతున్నారు.

రైతులు, కూలీలకు అటవీ అధికారుల సూచనలు :

  • పంట చేనుకు ఒంటరిగా ఎవరూ వెళ్లరాదు
  • ఉదయం 10 గంటల తర్వాతే ఇంటి నుంచి వెళ్లి, ఆ తర్వాత సాయంత్రం 4 గంటలలోపే ఇళ్లకు చేరుకోవాలి.
  • ఎర్రని దుస్తులు ధరించ రాదు.. ఈదుస్తువులు ధరించడం వల్ల పులితో ప్రమాదం పొంచి ఉంటుంది.
  • పులి కనిపిస్తే వెనకకు తిరిగి పరిగెత్తకూడదు. వీపు కనిపిస్తే వెంబడించే ప్రమాదం ఉంది.
  • పులి కనిపిస్తే పెద్దగా అరుపులు చేయరాదు. కదలకుండా నిటారుగా నిల్చోవాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us