AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ హీరో.. వన్డేల్లో జీరో? ఫార్మాట్ మారగానే చేతులెత్తేసిన యువ సంచలనం

Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ఇండియా ఏ ట్రై సిరీస్‌లో వన్డే ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు శ్రమిస్తున్నాడు. మంచి ఆరంభాలు అందుకున్నా భారీ స్కోర్లు చేయలేకపోతున్న ఈ యువ బ్యాటర్‌పై బీసీసీఐ, అభిమానుల దృష్టి నిలిచింది.

Vaibhav Sooryavanshi  : ఐపీఎల్ హీరో.. వన్డేల్లో జీరో? ఫార్మాట్ మారగానే చేతులెత్తేసిన యువ సంచలనం
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 20, 2026 | 7:47 AM

Share

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ లో తదుపరి సూపర్ స్టార్‌గా ప్రొజెక్ట్ చేయబడుతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గత కొంతకాలంగా ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 19వ సీజన్ లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో ఏకంగా 776 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ అసాధారణ ప్రదర్శన కారణంగానే జూన్ 6న ప్రకటించిన భారత సీనియర్ టీ20 జట్టులో (ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ల కోసం) అతనికి చోటు దక్కింది. అయితే, ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఇండియా ఏ ట్రై సిరీస్ లో మాత్రం ఫార్మాట్ మారడంతో వైభవ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

శ్రీలంక టూర్‌లో నిలకడలేని ప్రదర్శన

ఐపీఎల్ లో బౌలర్లను ఆడుకున్న వైభవ్‌కు వన్డే క్రికెట్ లో ఎలాంటి సవాళ్లు ఉంటాయో శ్రీలంక పర్యటన చూపిస్తోంది. ఈ సిరీస్ లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతని స్కోర్లు వరుసగా 14, 44, 21, 38 పరుగులుగా ఉన్నాయి. ఈ నంబర్లను గమనిస్తే అతను మంచి ఆరంభాలను అందుకుంటున్నాడు కానీ, వాటిని పెద్ద సెంచరీలు లేదా హాఫ్ సెంచరీలుగా మార్చలేకపోతున్నాడని స్పష్టమవుతోంది. జట్టుకు వేగవంతమైన ఓపెనింగ్స్ ఇస్తున్నప్పటికీ, మిడిల్ ఓవర్లలో వికెట్ పారేసుకోవడం టీం ఇండియా మేనేజ్‌మెంట్‌ను కాస్త ఆలోచనలో పడేసింది.

అఫ్గానిస్తాన్‌ ‘ఎ’ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ వివాదం

దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్ ఎ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్ లో వైభవ్ ఇన్నింగ్స్ ఎన్నో డ్రామాల మధ్య సాగింది. మ్యాచ్ ప్రారంభంలోనే తను ఇంకా ఖాతా తెరవకుండా ఉన్నప్పుడు.. షామ్స్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్ లో పాయింట్ ఫీల్డర్ ఫరిదూన్ ఒక అద్భుతమైన వన్-హ్యాండెడ్ క్యాచ్ పట్టాడు. ఫీల్డర్లు అవుట్ అని సంబరాలు చేసుకున్నా, థర్డ్ అంపైర్ రీప్లేలను చాలాసార్లు పరిశీలించి, బంతి భూమికి తాకినట్లు నిర్ధారించి నాటౌట్ గా ప్రకటించాడు. ఈ వివాదాస్పద నిర్ణయంతో వైభవ్ తృటిలో బతికిపోయాడు.

అవకాశాన్ని చేజార్చుకున్న యువ బ్యాటర్

ఆ తర్వాత స్క్వేర్ లెగ్ లో మరో ఈజీ క్యాచ్ డ్రాప్ అవ్వడంతో వైభవ్‌కు రెండో లైఫ్ దక్కింది. ఆ తర్వాత ఫామ్ అందుకున్న వైభవ్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో చెలరేగిపోయి 28 బంతుల్లో 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యతో కలిసి మొదటి వికెట్‌కు 75 పరుగులు జోడించాడు. అయితే, క్రీజులో సెట్ అయిన తర్వాత ఫరిదూన్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేక ఖలీద్ తనివాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రెండు సార్లు అదృష్టం కలిసివచ్చినా కూడా వైభవ్ పెద్ద స్కోరు చేయలేకపోవడం అతని అపరిపక్వతను చూపిస్తోంది.

టాలెంట్ ఉంది కానీ క్రాఫ్ట్ మారాలి

స్పోర్ట్స్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. వైభవ్ విఫలమయ్యాడని అనుకోవడం తప్పు. ఈ సిరీస్ లో అతను 150కి పైగా స్ట్రైక్ రేట్ తో 117 పరుగులు చేశాడు. అంటే అతనిలోని హిట్టింగ్ టాలెంట్ ఎక్కడికీ పోలేదు. వన్డే క్రికెట్ కు కావాల్సిన సెకండ్ గేర్ (ఫీల్డ్ విస్తరించినప్పుడు సింగిల్స్ తీయడం, స్పిన్‌ను ఎదుర్కోవడం) ను అతను ఇంకా అలవాటు చేసుకోవాల్సి ఉంది. బౌలర్లు అతని బ్యాటింగ్ శైలిని ముందే పసిగట్టి వ్యూహాలు రచిస్తున్నప్పుడు, కొత్త షాట్లతో సమాధానం చెప్పడం వైభవ్ ఇంకా నేర్చుకోవాలి.

బీసీసీఐ భవిష్యత్తు ప్రణాళికలు

వైభవ్ వయసు రీత్యా చూస్తే ఇండియా ఎ వేదికలు ఇలాంటి తప్పులను సరిదిద్దుకోవడానికే ఉపయోగపడతాయి. జోస్ బట్లర్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం వైభవ్ ప్రతిభను మెచ్చుకున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవాలంటే కేవలం బంతిని బలంగా బాదడమే కాకుండా, క్రీజులో ఎక్కువ సమయం గడపడం కూడా ముఖ్యమని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఇంగ్లాండ్ పర్యటన నాటికి వైభవ్ తన వన్డే లోపాలను సరిదిద్దుకుని పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us