Telangana: నర్సాపూర్‌లో టికెట్‌ ఫైట్.. బీఆర్ఎస్ సీటు ఆయనకా..! ఆమెకా..!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే టికెటే తెచ్చుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారట ఆ ఇద్దరు నేతలు..ఇతర నియోజక వర్గాల్లో లాగా వర్గపోరు అనే మాట లేకుండా బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేస్తూనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా నేతలు?

Telangana: నర్సాపూర్‌లో టికెట్‌ ఫైట్.. బీఆర్ఎస్ సీటు ఆయనకా..! ఆమెకా..!
Narsapur Constituency
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 30, 2023 | 7:44 PM

మదన్‌రెడ్డి సీటు సేఫేనా? మహిళానేతకు ఛాన్సుందా? నర్సాపూర్‌లో సైలెంట్‌ పాలిటిక్స్‌. అధినేత చెప్పేశారు అక్టోబరులోనే ఎన్నికలని. దీంతో ఉమ్మడి మెదక్‌జిల్లాలోని నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఎవరికన్న చర్చ జోరందుకుంది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి మధ్య కొన్నాళ్లుగా టికెట్‌ వార్‌ నడుస్తోందట. అయితే ఎక్కడా బయటపడకుండా సైలెంట్‌గా తన ప్రయత్నాల్లో ఉన్నారట సునీతా లక్ష్మారెడ్డి. అదే సమయంలో ఎవరూ తన సీటు లాగేసుకోకుండా.. తన జాగ్రత్తల్లో తానున్నారట సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి. టీడీపీతో పొలిటికల్‌ జర్నీ స్టార్ట్‌ చేశారు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి. 2004లో టీడీపీ నుంచి పోటీచేసి అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన సునీతా లక్ష్మారెడ్డి చేతిలో 25వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత గులాబీపార్టీలో చేరిన మదన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కి సన్నిహితంగా ఉంటారన్న ప్రచారం ఉంది.. 2014లో ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మొదటిసారి నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు మదన్‌రెడ్డి. 2018లోనూ 38వేలకు పైగా మెజారిటీతో రెండోసారి గెలిచారు. హ్యాట్రిక్‌ టార్గెట్‌తో మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు.

కాంగ్రెస్‌నుంచి వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన కొన్నాళ్లకే సునీతా లక్ష్మారెడ్డికి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ పదవితో ప్రాధాన్యమిచ్చింది బీఆర్‌ఎస్‌ నాయకత్వం. గతంలో రాజకీయ ప్రత్యర్థులైనా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలిద్దరూ ఇప్పుడు అధికారపార్టీలోనే ఉండటంతో ఈసారి టికెట్‌ ఎవరికన్న చర్చ నియోజకవర్గంలో చాలా రోజులుగా జరుగుతోంది. ఏడుపదుల వయసుదాటిన మదన్‌రెడ్డికి మరో ఛాన్సన్‌ కష్టమేనని, పార్టీ పెద్దలు సునీతా లక్ష్మారెడ్డివైపే మొగ్గుచూపుతున్నారని ఆమె అనుచరగణం ప్రచారంచేస్తోంది. సీఎంకి సన్నిహితుడైన ఎమ్మెల్యేకే మళ్లీ ఛాన్స్‌ ఇస్తారని మదన్‌రెడ్డి వర్గీయులు ఆ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారట.

అనుచరుల ప్రచారాలు ఎలా ఉన్నా నేతలిద్దరూ ఎక్కడా దీనిపై పెదవి విప్పటంలేదు. ప్రచారాన్ని పట్టించుకోకుండా ఇద్దరూ పార్టీ కార్యక్రమాల్లో కలిసే పాల్గొంటున్నారు. మార్చి 30న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు కూడా హాజరయ్యారు సునీతా లక్ష్మారెడ్డి. సునీతా లక్ష్మారెడ్డి వేడుకకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా హాజరై తమ మధ్య వర్గపోరు లేదని కేడర్‌కి సంకేతాలిస్తున్నారు. అయితే ఎప్పుడూ లేంది మొన్నటి బర్త్‌ డే వేడుకల్లో ఎమ్మెల్యే కామెంట్స్ గులాబీపార్టీలో చర్చకు దారి తీశాయంటున్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తానని మదన్‌రెడ్డి చెప్పటం హాట్‌టాపిక్‌గా మారింది. ఎప్పుడూలేంది బర్త్‌ డే వేడుకల్లో ఎమ్మెల్యే ఇలా ఎందుకు మాట్లాడరని చర్చించుకుంది గులాబీ కేడర్‌. అది సందర్భం కాకపోయినా పక్కనే ఉన్న తమ నాయకురాలిని ఉద్దేశించి ఎమ్మెల్యే ఇలా మాట్లాడి ఉంటారని డౌటు పడుతున్నారట సునీత వర్గీయులు.

నర్సాపూర్‌లో అభ్యర్థిని మార్చాలంటే తానే ఆప్షన్‌ అన్నట్లు సైలెంట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు సునీతాలక్ష్మారెడ్డి. కాంగ్రెస్‌లోని తన మద్దతుదారులను అదే పార్టీలో సైలెంట్‌గా ఉంచి.. బీఆర్ఎస్‌లో కొందరు నేతలు తనకు మద్దతిచ్చేలా చూసుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే. టైం వచ్చినప్పుడు అందరి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారన్న గుసగుసలు నడుస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు బాహాటంగా వ్యతిరేకించుకుంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నా నర్సాపూర్‌లో మాత్రం సైలెంట్‌గానే తెరవెనుక రాజకీయం నడుస్తోంది. ఇద్దరికీ పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో అధినాయకత్వానికి ఆ ఇద్దరే ఆప్షన్‌ అంటున్నారు. అయితే ఒకరికి టికెట్‌ ఇస్తే మరొకరి పరిస్థితేంటన్న చర్చ మొదలైంది నర్సాపూర్ నియోజకవర్గంలో.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం