కారు బీభత్సం.. హుక్కా మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. చివరికి ఏమైందంటే..
వారందరూ యువకులే. ఆదివారం సెలవు కావడంతో సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రంతా జల్సా చేశారు. హుక్కా మత్తులో మితిమీరిన వేగంతో కారు నడిపారు. అదుపుతప్పిన వీరి కారు..
వారందరూ యువకులే. ఆదివారం సెలవు కావడంతో సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రంతా జల్సా చేశారు. హుక్కా మత్తులో మితిమీరిన వేగంతో కారు నడిపారు. అదుపుతప్పిన వీరి కారు.. ముందున్న వాహనాన్ని ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా ఎదురుగా వస్తున్న కారునూ ఢీ కొట్టింది. ఫలితం మూడు నిండు ప్రాణాలు. మృతి చెందిన వారిలో తల్లి, అయిదేళ్ల కుమార్తె ఉండటం బాధాకరం. ప్రమాదానికి కారణమైన వాహనంలోని ఓ యువకుడు సైతం మృతి చెందాడు. బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం కేసారం వద్ద సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన రవికిరణ్, స్రవంతి భార్యాభర్తలు. వీరికి ధ్రువిక, మోక్ష కుమార్తెలు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలోని ఓ కంపెనీలో రవికిరణ్ పనిచేస్తున్నారు. భార్య, పిల్లలతో కలిసి సోమవారం ఉదయం తాండూరు బయల్దేరారు.
కేసారం గేటు దాటాక ఎదురుగా వచ్చిన వాహనం.. ముందున్న స్విఫ్ట్‌కారును ఢీ కొట్టుకుంటూ వచ్చి వీరి కారుని ఢీ కొట్టింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న మర్రి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. వాహనంలో ప్రయాణిస్తున్న స్రవంతి, ధ్రువిక అక్కడికక్కడే మృతి చెందగా.. రవికిరణ్, మోక్షకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి వెనుక నుంచి వస్తున్న మరో ఇన్నోవా కారును సైతం.. ప్రమాదానికి కారణమైన వాహనం ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అందులో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న సయ్యద్ ఫైసల్ తీవ్ర గాయాలతో మరణించాడు. ప్రమాదానికి గురైన మరో రెండు కార్లలో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ఆరుగురూ 21-22 ఏళ్ల యువకులే కావడం గమనార్హం. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వీరందరూ.. ఆదివారం సెలవు కావడంతో చేవెళ్ల మండలంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. రాత్రంతా హుక్కా తాగుతూ జల్సా చేశారు. ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ బయల్దేరారు. మత్తులో వాహనాన్ని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారకులయ్యారు.
Also Read
Covid 19: దిగివస్తున్న కరోనా మహమ్మారి.. సాధారణ స్థితికి అయా దేశాలు.. ఆంక్షలు సడలించడంపై WHO ఆందోళన