Khammam: అందరిలా ఉంటే ఎవరు ఇంట్రస్ట్ చూపిస్తారు చెప్పండి.. అందుకే రంగు రంగుల పూరీలు
ఖమ్మం నగర వాసులు ఆరోగ్యకరమైన రంగురంగుల పూరీలు, దోసెలు, ఇడ్లీలు తినాలంటే బస్ డిపో రోడ్ లోని గుప్తా హోటల్ కి ఒక్కసారి వెళ్లాల్సిందే..
Telangana: భోజన ప్రియులను వెరైటీ ఫుడ్స్‌తో ఆకట్టుకునేందుకు హోటళ్ల నిర్వాహకులు ప్రయత్నిస్తుంటారు. రకరకాల రుచులను పరిచయం చేస్తూ.. కస్టమర్స్‌ను ఆకర్షించి… బిజినెస్ పెంచుకోవాలనుకుంటారు. ఇదే క్రమంలో ఉన్నత చదువులు చదివినా.. వృత్తికి… ప్రవృత్తికి ఏదీ అడ్డుకావని నిరూపించింది ఓ జంట. తమ ప్రాంతం వారికి భిన్న రుచులను పరిచయం చేస్తూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు ఈ క్రేజీ కపుల్. పీజీ చదివిన గుప్తా.. ఎంబీఏ చదివిన భార్య శిరీషతో కలిసి ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అందరి హోటళ్లలో దొరికే పూరీలు, దోసెలు, ఇడ్లీలు కాకుండా కొత్తగా చేయాలనే ఆలోచనతో పోషకాలు కలిగిన పాలకూరతో పాలక్ పూరీలు, క్యారెట్ పూరీలు, రాగి ఇడ్లీలు ఇలా ఆరోగ్యానికి హాని లేకుండా మంచి పోషక పదార్థాలు ఉన్న వాటిని టిఫిన్ రూపంలో అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కూడా ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో.. నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని పోషిస్తున్న హోటల్ నడుపుతున్నట్లు హోటల్ నిర్వహకులు గుప్తా చెప్పారు. తన తండ్రి నుండి వచ్చిన అనుభవంతో కస్టమర్లకు పరిశుభ్రమైన వాతావరణంలో మంచి రుచికరమైన రంగురంగుల టిఫిన్ లను అందిస్తూ కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్నటున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు హోటల్ యజమాని గుప్తా. ఖమ్మం నగర వాసులు ఆరోగ్య కరమైన రంగురంగుల పూరీలు, దోసెలు, ఇడ్లీలు తినాలంటే బస్ డిపో రోడ్ లోని గుప్తా హోటల్‌కి ఒక్కసారి వెళ్లాల్సిందే..
నారాయణ, టీవీ9 తెలుగు, ఖమ్మం