
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి దశ ఎన్నికల తరహాలోనే రెండో విడతలో బీఆర్ఎస్, బీజేపీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 14) జరిగిన రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల్లో ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త మిస్సింగ్ మిగతా అభ్యర్థులను టెన్షన్ పెట్టింది. ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త జనార్ధన్ రెడ్డి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆయన శనివారం ప్రచారం చేసిన అనంతరం అదృశ్యమయ్యాడు. ఊరి నుంచి పారిపోయాడు. ప్రత్యర్థులు జనార్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేశారని.. చంపేసి ఉంటారని ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ సాయంతో జనార్ధన్ కోసం గాలింపు చేపట్టారు. చివరికి పొలాల్లో జనార్దన్‌ను గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు. ఈలోగా గ్రామంలో 70శాతానికి పైగా పోలింగ్ పూర్తయింది. అయితే సబిత ఓట్ల కోసం తన భర్తను దాచిపెట్టిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. తమను హంతకులుగా ముద్రవేయడం వల్ల ఓటర్లు చీకొట్టారని, మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ పోలింగ్ కేంద్రంలో సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మెదక్ జిల్లా కొనాయపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు దిగారు. దీంతో పోలీసులు రెండు పార్టీల నేతలకు నచ్చజెప్పి పంపించారు. అటు ఖమ్మం జిల్లా గోళ్లపాడులో ఎన్నికల గుర్తుకి క్షుద్రపూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. కాంగ్రెస్ అభ్యర్థి రవి ఓడిపోవాలనే ఇలా క్షుద్రపూజలు చేశారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల వేళ నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు బయపడింది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి , మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తిమ్మాజీపేట మండలం అవంచలో సర్పంచ్ పదవికి పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టారు మర్రి జనార్థన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి. ఆవంచ లక్ష్మారెడ్డి స్వగ్రామం కావడంతో తనకు అనుకూల వ్యక్తిని బరిలోకి దింపారు. మరోవైపు తన అనుచరుడిని పోటీలో నిలబెట్టారు మర్రి జనార్థన్. దీంతో ఇద్దరి అనుచరులు బాహాబాహీకి దిగారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి పెద్దతండాలో సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఓటుకు 4 వేలు పంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఖర్చుపెట్టిన డబ్బంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..