BIG Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న నాలుగు రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం సాయంత్రం నుంచి రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని తెలిపింది.

హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. అయితే ఈ సాయంత్రం నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహాబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు 30 నుంచి 40 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మే 14 , 15 తేదీలలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 16వ తేదీన కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక మరోవైపు చురుక్కా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికి దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు నికోబార్ దీవులను తాకినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా ఈ రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. అయితే ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…