మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..
Bad Signs: జీవితంలో అనుకోని కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది అంతా నా టైమ్ అని సరిపెట్టుకుంటారు. కానీ మన పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా విపత్తు సంభవించే ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుందట. వాటిని గుర్తించి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చెడు జరగకుండా అడ్డుకోవచ్చు..

మనం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతుంటాయి. వీటిని మనం కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేస్తాం. కానీ పండితులు ఇవి రాబోయే కష్టాలకు ముందస్తు హెచ్చరికలు అని అంటున్నారు. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుందామా..
ఇంటి లోపల కనిపించే అశుభ సంకేతాలు
ఇంట్లో పసుపు, కుంకుమ నేలపై పడటం లేదా పాలు పొంగి కింద చిందడం అశుభంగా చెప్తారు. అద్దాలు లేదా గాజు సామాగ్రి అకస్మాత్తుగా పగిలితే అది ఏదో నష్టానికి సంకేతం. హారతి ఇచ్చేటప్పుడు లేదా పూజ సమయంలో నూనె, వత్తి సరిగ్గా ఉన్నా దీపం పదే పదే ఆరిపోతే అది దైవగ్రహింపు లోపించిందని అర్థం. ఇంట్లో ఎర్ర చీమలు వరుసగా కనిపిస్తే అది ఆర్థిక ఇబ్బందులకు లేదా గొడవలకు దారితీస్తుందని నమ్ముతారు.
జంతువులు, పక్షుల ప్రవర్తన
ఇంటి ముందు కుక్కలు వింతగా మొరగడం లేదా ఏడ్చినట్లు శబ్దం చేయడం రాబోయే విపత్తుకు సూచన. పిచ్చుకలు కిటికీల వద్ద విపరీతమైన శబ్దం చేయడం, కాకులు ఇంటి ముందు అరుస్తూ గొడవ చేయడం కూడా చెడు శకునాలే. పెంపుడు జంతువులు అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడటం లేదా మరణించడం ఆ కుటుంబంపై ఉన్న దోషాన్ని సూచిస్తుంది.
శారీరక – ప్రకృతి మార్పులు
పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను అదరడం అశుభంగా భావిస్తారు. ఎంత నీరు పోసినా ఇంట్లోని మొక్కలు లేదా చెట్లు అకస్మాత్తుగా ఎండిపోతుంటే అది ఆ ఇంట్లోని సానుకూల శక్తి తగ్గిపోతుందనడానికి నిదర్శనం.
చెడు శకునాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి?
అశుభ సంకేతాలు కనిపించినప్పుడు భయపడకుండా కొన్ని శాంతి మార్గాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు:
శుద్ధీకరణ: ఇంటి అంతటా గోమూత్రం, పసుపు నీరు లేదా గంగాజలాన్ని చల్లాలి.
ప్రార్థన: ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. తులసి నీరు లేదా విభూతి నీటిని చల్లడం వల్ల ప్రతికూల శక్తి నశిస్తుంది.
పెద్దల ఆశీర్వాదం: గురువులను లేదా ఇంట్లోని పెద్దల పాదాలను తాకి నమస్కరించడం వల్ల దోషాల తీవ్రత తగ్గుతుంది.
దానధర్మాలు: విజ్ఞులను లేదా బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం శుభప్రదం.
మంచి ప్రవర్తన స్వర్గం.. చెడు ప్రవర్తన నరకం అని పండితులు గుర్తుచేస్తున్నారు. శకునాలు అనేవి కేవలం హెచ్చరికలు మాత్రమే. మనం చేసే సత్కర్మలు, దైవ ప్రార్థన ద్వారా రాబోయే ఏ ఆపదనైనా అధిగమించవచ్చు.




