Suryapet: మూడో కాన్పులోనూ ఆడపిల్లే.. భారంగా భావించి.. కానీ తల్లి మనసు ఊరుకోదు కదా..
ఆడా మగా అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న.. ఆడపిల్లలపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడపిల్ల.. అనగానే చాలు. పురిట్లోనే కాటికి పంపిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు....

ఆడా మగా అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న.. ఆడపిల్లలపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆడపిల్ల.. అనగానే చాలు. పురిట్లోనే కాటికి పంపిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. పోషించలేమనో, ఆర్థికంగా భారంగానో భావించి వారిపట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. కన్నపేగు అనే కనికరం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. సూర్యాపేట జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో.. ఆ తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఊయలలో వదిలేసి వెళ్లిపోయారు. కానీ.. తల్లి మనసు ఊరుకోదు కదా.. ఇంటికెళ్లిన కొంత సమయం తర్వాత.. చిన్నారి కావాలని పట్టుబడింది. దీంతో ఆస్పత్రికి వెళ్లిన ఆమె భర్తకు షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైంది. సూర్యాపేట జిల్లా మోతె మండలం గోపతండాకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. తన భార్య ప్రసవం కోసం డిసెంబరు 23న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. అదే రోజు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆడపిల్ల జన్మించడంతో వారు భారమని భావించారు.
అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో చిన్నారిని వదిలించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో శిశువును సాకలేమనంటూ ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో బిడ్డను వదిలేసి ఇంటికెళ్లిపోయారు. అయితే.. కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి మనసు మారింది. చిన్నారిని తీసుకురావాలని భర్తను కోరింది. ఆమె కోరికను అతను కాదనలేకపోయాడు. ఆస్పత్రికి వెళ్లి ఊయలలో వదిలిపెట్టిన పాపను తీసుకునేందుకు సిబ్బందిని సంప్రదించాడు.
తమ బిడ్డేనని, ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది.. సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై అప్పటికే ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ కేసు నమోదు చేయడంతో శిశువును అప్పగించేందుకు నిబంధనలు అమలులోకి వచ్చాయి. విచారణ చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..