
పెళ్లంటే జీవితంలో ఓ మధురమైన ఘట్టం. పెళ్లి చేసుకోబోయే యువతి యువకులు ఆ క్షణాల కోసం ఎన్నో కలలు కంటారు. కానీ ఈ మధ్య పెళ్లిల్లు పీటల మీదకు వచ్చాకా కూడా పెటాకులవ్వడం జరుగుతున్నాయి. వరుడు మధ్యం తాగి వచ్చాడనో లేదా గొడవ చేశాడనే కారణంతో వధువులు అప్పటికప్పుడే పెళ్లి రద్దు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ యువతి(24) కుటుంబసభ్యులకు ఇటీవలే చిత్తూరుకు చెందిన తేజ స్వీట్స్ అధినేత, ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి ఏ.రవిబాబు కుటుంబ సభ్యులకు పరిచయం ఏర్పడింది. ఆయన కొడుకు వైష్ణవ్ కు ఆ యువతికి పెద్దలు సంబంధం కుదిర్చారు. అయితే రవిబాబు కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని రూ.3 కోట్లు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆ యువతి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.
అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో తిరుపతిలోని తాజ్ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేశారు. కానీ చివరి క్షణాల్లో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు మరో తేదీన ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని చెప్పారు. దీంతో నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని తెలిపారు. అయితే పలు కారణాలవల్ల ఎంగేజ్‌మెంట్ లేకుండా నేరుగా పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలు నిర్ణయానికి వచ్చాయి.గతేడాది నవంబర్ 20న లగ్న పత్రిక రాసుకున్న సమయంలో పెళ్లికుమార్తె తండ్రి వైష్ణవ్‌కు డైమండ్ రింగ్, రోలెక్స్ వాచీ, బంగారు గొలుసు పెట్టారు. అలాగే వైష్ణవ్ కుటుంబసభ్యులు పెళ్లికుమార్తెకు ఓ నెక్లెస్ పెట్టారు. అయితే ఫిబ్రవరి 9న డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించాలని పెళ్లికొడుకు కుటుంబసభ్యులు కోరడంతో మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 7నుంచి 10దాకా రిసార్ట్‌ను బుక్ చేయడంతో పాటు సుమారు రూ.50లక్షలతో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాగా పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు డ్యాన్స్ రిహార్సల్స్ చేసేందుకు పెళ్లి కొడుకుతోపాటు అతడి బంధువులు, స్నేహితులు ఆ రిసార్ట్‌కు వచ్చారు. మహిళా కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వైష్ణవ్ ఆమెతో పాటు అక్కడున్న ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గుర్తించిన పెళ్లికూతురు అతడ్ని నిలదీసింది.
కానీ అప్పటికే పీకలదాకా మద్యం తాగిన వైష్ణవ్‌తో పాటు అతడి స్నేహితులు ఆమెతో దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఆ పెళ్లికూతురు సోదరుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా చివరికి అతడ్ని కూడా చితకబాదారు. దీంతో మాటామాటా పెరగడంతో ఇరువర్గాల పెద్దలు రంగంలోకి దిగి సర్ది చెప్పేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. తన కళ్లముందే మద్యం తాగి, డ్రగ్స్ తీసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వైష్ణవ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పెళ్లికూతురు చెప్పేసింది. అయితే పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన రూ.50 లక్షలతో పాటు తాము ఇచ్చిన వస్తువులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాని వైష్ణవ్ కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించలేదు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు, ఆభరణాలు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పెళ్లికొడుకు వైష్ణవ్‌తోపాటు అతని కుటుంబసభ్యులు, స్నేహితులపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..