మానవత్వం మంటగలుస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులపై దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నాగర్ కర్నూలులో అలాంటి ఘటనే జరిగింది. నవ మాసాలు మోసిన బరువు, పేగు తెంచుకున్న బంధాన్ని ఓ తల్లి మర్చిపోయింది. కళ్లు కూడా తెరవని శిశువుపై కనికరం లేకుండా బిహేవ్ చేసింది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ.. శిశువుకు జన్మనిచ్చింది. అయితే.. ఏం జరిగిందో ఏమో.. ఆస్పత్రి బాత్ రూమ్ నాలాలో చిన్నారి డెడ్ బాడీ కనిపించింది. మృత శిశువు డెడ్ బాడీని అత్యంత దారుణంగా నాలాలో వేసి, మూతను గట్టిగా బిగించారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. దీనిని సీరియస్ గా తీసుకున్న అధికారులు.. ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. డెలివరీ వార్డులోని బాత్రూంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యం అయింది. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఉన్న వారందరూ ఆందోళనకు గురయ్యారు. సోమవారం ప్రసూతి వార్డులో 18 మంది గర్భిణీలు.. ప్రసవం కోసం వచ్చారు. వారిలో 8 మందికి సిజేరియన్ చేశారు. మరో ముగ్గురికి నార్మల్ డెలివరీ అయింది. దీంతో పాటు గర్భిణీల ఆరోగ్య సమస్యల కోసం జనరల్ ఓపీ ఏర్పాటు చేశారు. అయితే బాలింతలకు ఏర్పాటు చేసే వార్డులోని బాత్రూం నీళ్లు వెళ్లే నాలా వద్ద మృతి చెందిన శిశువును పడేశారు. నాలా మూత ఓపెన్ చేసి అందులో పడేసి మూత బిగించారు.
అనంతరం వార్డులోని రోగులు బాత్రూంకి వెళ్లిగా మురుగునీరు వెళ్లకపోవడంతో సానిటేషన్ సిబ్బందిని పిలిపించారు. వారు గమనించే క్రమంలో ఒక్కసారిగా మృత శిశువును చూసి కంగుతిన్నారు. విషయం ఆసుపత్రి నిర్వాహకులకు తెలపగా వారు పరిశీలించి ఇదే రోజు గుర్తు తెలియని మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూడాలని కోరుతున్నారు ఆస్పత్రికి వచ్చే రోగులు వారి బంధువులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..