AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tandur Redgram: నాణ్యతలో మేటి… రుచిలో మరేదు రాదు సరిసాటి.. తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు

తాండూరు కంది పప్పుకు నాణ్యతతో పాటు మంచి పేరు ఉంది. నాణ్యతలో మేటీ… రుచిలో అద్భుతం అని దేశవ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడి నుంచి కందిపప్పు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతోంది.

Tandur Redgram: నాణ్యతలో మేటి... రుచిలో మరేదు రాదు సరిసాటి.. తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు
Tandur Red Gram
Ram Naramaneni
|

Updated on: Jan 19, 2023 | 3:39 PM

Share

తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు దక్కింది. నాణ్యతాపరంగా తాండూరు కందికి విశిష్ట లక్షణాలు ఉంటాయి. రుచి, సువాసన,  పోషకాల మెండుగా ఉన్న ఈ కందికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తాండూరు నేలల స్వభావం, భూమిలోని పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సాంప్రదాయ, ఆధునిక యాజమాన్య పద్దతుల మూలంగా ఈ కందికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలో లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగు చేస్తున్నారు రైతులు.  ఇప్పటి వరకు దేశమంతటా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుంచి వెయ్యి ధరఖాస్తులు వచ్చాయి. అందులో 432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపు దక్కింది. ఆజాది కా అమృత్ ఉత్సవాలలో భాగంగా 75 ఉత్పత్తుల వివరాలను జిఐ జర్నల్‌లో ప్రచురించారు. గత ఏడాది వచ్చిన ధరఖాస్తులలో కేవలం 9 ఉత్పత్తులకు మాత్రమే ఈ గుర్తింపు దక్కింది. అందులో తాండూరు కంది ఒకటి కావడం గమనార్హం.

తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇప్పటివరకు ఆరు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు దక్కింది. పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ రగ్గులు(2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) గుర్తింపు పొందిన వాటిలో ఉన్నాయి. అందులో మామిడి, కంది ఉద్యాన, వ్యవసాయ రంగ ఉత్పత్తులు కావడం విశేషం. వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండడం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకత.  తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణమట.  దేశంలోని ఢిల్లీ, ముంబయి, కోల్ కతాలలో తాండూరు కంది బ్రాండ్‌కు డిమాండ్ ఉంది. యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం, తాండూరు కంది పరిశోధనా స్థానం వారు  భౌగోళిక గుర్తింపు కోసం ధరఖాస్తు చేశారు. ఈ మేరకు గుర్తింపు దక్కింది.

తాండూరు కంది భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్‌లను  అభినందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తలను సన్మానించనుంది ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..