AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇక తెలంగాణలోనూ పూయనున్న కాశ్మీర్ పువ్వు.. ఎలా అంటే?

Saffron cultivation in Telangana: కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండే విలువైన కుంకుమపువ్వు (సాఫ్రాన్) ను తెలంగాణలోనూ పండించవచ్చని హార్టికల్చర్ వర్సిటీ నిరూపించింది. ఏరోఫోనిక్ టెక్నాలజీ ఆధారంగా నియంత్రిత వాతావరణంలో సాగు చేసిన ఈ పంట రెండు నెలల్లోనే అత్యుత్తమ దిగుబడిని ఇచ్చి, రాష్ట్రంలో కొత్త వ్యవసాయ అవకాశాలకు దారితీసింది. నాబార్డ్ మద్దతుతో వనపర్తి జిల్లా మోజర్ల హార్టికల్చర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మోడల్ ల్యాబ్ ఈ ప్రాజెక్టుకు కేంద్రబిందువైంది.

Telangana: ఇక తెలంగాణలోనూ పూయనున్న కాశ్మీర్ పువ్వు.. ఎలా అంటే?
Telangana
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 14, 2025 | 9:36 AM

Share

కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండే విలువైన కుంకుమపువ్వు (సాఫ్రాన్) ను తెలంగాణలోనూ పండించవచ్చని హార్టికల్చర్ వర్సిటీ నిరూపించింది. ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో రూపొందించిన 200 చదరపు అడుగుల ఏరోఫోనిక్ యూనిట్‌లో కాశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమపువ్వు కాడలు నాటారు. అక్కడి తరహాలోనే పగలు రాత్రి ఉష్ణోగ్రతలు, తేమ, కాంతి, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను ప్రత్యేక పరికరాలతో నియంత్రించారు. మొబైల్ యాప్ ద్వారా నిరంతరం మానిటరింగ్ చేస్తూ సాగు కొనసాగించారు. ఫలితంగా కుంకుమపువ్వు మొక్కలు చక్కగా పెరిగి, పుష్పించడం మొదలైంది. నాణ్యత, దిగుబడి రెండూ ఆశించిన దాని కంటే మెరుగ్గా రావడం శాస్త్రవేత్తలను ఉత్సాహపరిచింది.

ఏరోఫోనిక్ పద్ధతి..

ఈ సాంకేతికతలో నేల అవసరం లేకపోవడం, నీటి వినియోగం తక్కువగా ఉండడం, పూర్తిగా సేంద్రీయ ఉత్పత్తి సాధ్యమవడం పెద్ద లాభాలు. కూలీల అవసరం చాలా తగ్గడం, నాణ్యమైన దిగుబడి లభించడం రైతులకు ఆశాజనకంగా ఉంది. అందుకే ఇప్పటికే అనేక మంది ఔత్సాహికులు ఈ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు.

కాశ్మీర్‌కు ప్రత్యామ్నాయం తెలంగాణ?

ప్రస్తుతం దేశంలో సంప్రదాయ కుంకుమపువ్వు సాగు జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా, శ్రీనగర్, బుద్గామ్ ప్రాంతాలకే పరిమితం. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం, వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేయడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే కాక, నాణ్యతపైనా దెబ్బ పడుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై పరిశోధనలు వేగవంతమయ్యాయి. అందులోనూ ఏరోఫోనిక్ సాగు అత్యుత్తమ ఫలితాలు ఇస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

రూరల్ ఎకానమీకి కొత్త ఊపు

రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాల్లో ఈ ప్రయోగ విజయవంతం కావడం రాష్ట్రానికి పెద్ద విజయం అని నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్ భాస్కర్ తెలిపారు. సాఫ్రాన్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు, యువతకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం ఇస్తుందన్నారు.

ఉత్తమ దిగుబడి

కాశ్మీర్ వాతావరణాన్ని ల్యాబ్‌లోనే సృష్టించి సాగు చేశాం. దిగుబడి, నాణ్యత రెండూ అత్యుత్తమంగా నిరూపించుకున్నాయి. ఆసక్తి ఉన్నవారు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు అని ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ పిడిగం సైదయ్య తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో మోడల్ ల్యాబ్లు

హార్టికల్చర్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో త్వరలో ఈ టెక్నాలజీని రైతులకు విస్తృతంగా అందించబోతున్నామని అన్నారు. అవసరమైతే ప్రాంతాల వారీగా సాఫ్రాన్ మోడల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ప్రణాళిక సిద్ధమవుతోంది. తెలంగాణలో కుంకుమపువ్వు సాగుకు ఇది ఒక చారిత్రక ఆరంభం. ఏరోఫోనిక్ టెక్నాలజీతో రాష్ట్రం దేశంలోనే ప్రత్యామ్నాయ సాఫ్రాన్ ఉత్పత్తి కేంద్రంగా ఎదగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.