Telangana Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు భారీ వర్ష సూచన..
Telangana Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్, గల్ఫ్ ఆఫ్ మార్టబన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

Telangana Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్, గల్ఫ్ ఆఫ్ మార్టబన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది 24వ తేదీ నాటికి అల్పపీడనంగా ఏర్పడి.. ఉత్తర ఒడిసా తీరం దిశగా పయనించనుందని చెప్పారు. ఇదిలాఉంటే… ఇప్పటికే పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయంటున్నారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇదిలాఉంటే.. బుధవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయన్న వాతావరణ కేంద్రం.. సంబంధిత వర్షపాత వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలో 5 సెంటీమీర్లకు పైగా వర్షపాతం నమోదైందన్నారు. అలాగే, మెదక్ జిల్లాలోని మిన్పూర్‌లో 7.5, రేణికుంటలో 9.03, కందిలో 6.15, ఖాసీంపేటలో 5.95, మిర్యాగూడలోని టీక్యాతండాలో 5.55 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Also read:
చీరకట్టును అవమానిస్తారా సిగ్గుచేటు.. రెస్టారెంట్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..