తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెల్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. రేపట్నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని, వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేసింది.
కాగా గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం లభించినట్లైంది. శుక్ర, శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, వర్ష సూచన లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
అటు ఏపీలోనూ ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండరాదని సూచించింది. నిన్న శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44.8 డిగ్రీల సెల్సియస్ , పల్నాడు మాచర్ల జిల్లాలో 44.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.