తెలంగాణలో మూడురోజుల వరకు వాతావరణ సూచన
బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర చత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర చత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటలలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు-పశ్చిమ వెంబడి మధ్య భారతదేశం మీదుగా 4.5 కిలోమీటర్లు నుండి 7.6 కిలోమీటర్లు ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురు వారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో చాలా ప్రాంతాలలో వర్షాలు కరిసే ఛాన్స్ ఉందని తెలిపారు.
ఇక, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు అనేక చోట్ల, రేపు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, జిల్లాలలో ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.




