
హైదరాబాద్, ఫిబ్రవరి 26: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తెలంగాణలో నేడు, రేపు.. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణులు తోడు కావడంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల సోమ, మంగళ వారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రకటించింది. ముఖ్యంగా అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమ్రుంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో రానున్న 48 గంటల్లో సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
దాదాపు శీతాకాలం ముగిసింది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. గతవారం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సీజన్‌లో సాధారణంగా నమోదు కావాల్సిన స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముందస్తుగా వేసవి హెచ్చరిక తెలిసేలా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణం కంటే కిందకు పడిపోయాయి. శీతాకాలం చివరి దశలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రెండ్రోజులు ఇదే తరహా వాతావరణం ఉన్నప్పటికీ వచ్చే వేసవి మునుపటి కంటే తీవ్రంగా ఉండనుందని హెచ్చరిస్తున్నారు.
ఈ నెల ఆరంభం నుంచే వాతావరణ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా.. ద్రోణి ప్రభావంతో వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే మునుముందు రోజుల్లో మాత్రం భానుడి ప్రతాపం రికార్డు స్థాయిలో ఉంటుందట. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 15.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున నమోదైంది. రానున్న వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి తగు జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా వాతావరణ కేంద్రం సూచించింది.
‘
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.