Telangana: కేంద్రం తెస్తోన్న కొత్త విద్యుత్ చట్టాలపై ఉద్యోగుల నిరసన.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించబోతున్నారు. దీంతో రేపు తెలంగాణలో కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana:కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కేంద్రానికి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ మహా ధర్నాకు పిలుపు నిచ్చారు. సోమవారం ఆగష్టు 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు నిరసనల కార్యక్రమాలని చేపట్టనున్నామని ప్రకటించారు. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు అంతా మహాధర్నాకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ మేరకు పవర్ ఇంజనిర్స్ అసోసియేషన్, విద్యుత్ JAC ప్రతినిధులు మహా ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించబోతున్నారు. దీంతో రేపు తెలంగాణలో కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనని విద్యుత్ ఉద్యోగులు చెప్పారు. సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో వినియోగదారులకే తీవ్ర నష్టమని అంటున్నారు. ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని.. దానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు.
విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే.. పూర్తిగా విధులను బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లుతో అనేక సమస్యలు వస్తాయని.. అసలు విద్యుత్ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థలకు రూపాయి ఖర్చు లేకుండా అదే విద్యుత్ లైన్ నుండి సరఫరా చేసేలా ఈ బిల్లు ఉందని.. ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర తీసుకొచ్చే కొత్త చట్టంతో వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని పేర్కొన్నారు.