Telangana Political News: టీఆర్ఎస్ అసమ్మతి నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) పొలిటికల్ ఫ్యూచర్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్‌కు ఆయన త్వరలోనే గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ ప్లనరీకి ఆయన గైర్హాజరుకావడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. రాహుల్ సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారంటూ మీడియా వర్గాల్లోనూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాలను తోసిపుచ్చిన జూపల్లి.. తాను టీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఈ ప్రచారం 100 శాతం బోగస్‌గా కొట్టిపారేశారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం సహా ఇతర అధికార యంత్రాంగాలు పూర్తిగా అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తాను పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే వారి మీద చర్యలు తీసుకోవడం లేదని.. ఎవరు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.
జిల్లా మంత్రులు, అధికారులు, రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోనందునే దానికి ప్రొటెస్టుగా తాను టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరుకాలేదని జూపల్లి తెలిపారు. అంతే తప్ప దీని వెనుక మరో ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నందునే ప్లీనరీకి తాను హాజరుకాలేదన్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను..రేపు ఏం జరుగుతుందో వారి నిర్ణయాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని చెప్పారు.
తమ నియోజకవర్గంలో అధికారులు, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని జూపల్లి అసంతృప్తి వ్యక్తంచేశారు. పోలీసులు కార్యకర్తలను బూటు కాలుతో తన్నడం, బెల్టుతో కొట్టడం, రౌడీ షీట్లు పెట్టడం, మహిళలను, ప్రజలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాలు పార్టీ నాయకత్వం దృష్టికి కూడా చేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతి త్వరలో మళ్లీ పార్టీ అధినాయకత్వాన్ని కలుస్తానని జూపల్లి తెలిపారు.
మరిన్ని రాజకీయ వార్తలు ఇక్కడ చదవండి..
Also Read..
Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా..
KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..