తెలంగాణ పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఇంతకీ అసలు టార్గెట్ ఎవరు?
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయాలు వేడెక్కాయి.. అన్ని పొలిటికల్ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనప్పటికీ..
Telangana Congress Dalitha Girijana Sabha: తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయాలు వేడెక్కాయి.. అన్ని పొలిటికల్ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనప్పటికీ.. ఇప్పటి నుంచే కదనరంగంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి అన్ని పార్టీలు.. ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు ఉండగానే అన్ని పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో జనంతో ఏకమయ్యేందుకు కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి.. కార్యాచరణ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎవరికి వారు.. తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ షెడ్యూల్ సిద్ధంచేసుకుంది. ఇక షర్మిల కూడా అదే బాటలో నడుస్తుంది. పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కూడా.. ముందస్తుగా బహిరంగ సభలు, ఆ తర్వాత తన నడకను మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నీ… పాదయాత్రకు దారులు వేసుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర రోజే కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన దండోరా సభ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అదీ కూడా సీఎం కేసీఆర్ ఇలాకాలో పెట్టాలని ఫ్లాన్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బందు పథకానికి కౌంటర్‌గా ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సమర శంఖం ఊరించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభ సక్సెస్‌తో రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. దళిత గిరిజన దండోరా రెండో సభను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఆ సభ తర్వాత మూడో సభను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిథిలో నిర్వహించాలని నిర్ణయించింది. అదీ కూడా సీఎం కేసీఆర్ సొంత ఇలాకా గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా మోగించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే, గులాబీ బాస్ ఇలాకాలో సభ పెట్టడం అది కూడా 24 న పెట్టడం వెనుక అటు టీఆరెస్‌ను, ఇటు బీజేపీని కూడా టార్గెట్ చేసింది కాంగ్రెస్. ఎందుకంటే అదే రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర కూడా ఈ నెల 24 నా మొదలు కానున్న నేపథ్యంలో అదే రోజు దళిత దండోరా సభ గజ్వేల్‌లో ప్లాన్ చేయడంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా భావిస్తుంది కాంగ్రెస్. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ అంటే దృష్టి మొత్తం సభ పైననే ఉంటుందనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తుంది.
కాగా, ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్. ఈ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాకి భారీ సంఖ్యలో దళిత, గిరిజనులు హాజరయ్యేలా కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 24న గజ్వేల్ హౌసింగ్ బోర్డ్ వద్ద ఈ దండోరా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు హస్తం నేతలు. ఈ సభ ద్వారా కేసీఆర్ దళిత గిరిజనులకు చేసిన అన్యాయాలపై కౌంటర్ వాయిస్ వినిపించాలని ప్లాన్ చేస్తున్నారు టీ కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే గజ్వేల్ సభకు ఇంచార్జీ గా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డిని నియమించింది టీ పీసీసీ. ఇక, ఇప్పటికే సభ ఏర్పాట్ల పర్యవేక్షణ ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి చూస్తున్నారు. ఇటు కేసీఆర్.. అటు బీజేపీ రెండింటినీ ఒకేసారి టార్గెట్ చేయబోతున్నారు హస్తం నేతలు.
బోయినపల్లి అశోక్ గౌడ్, టీవీ9, ప్రతినిధి హైదరాబాద్