Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెల్ల అత్యాచారం కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఇంకా జాడలేని అక్కా!
తెలిసినవాడు ఉన్నాడు కదాని.. సిటీకి వస్తే జీవితం నాశనం చేశాడు. ఒక్కడే నీచానికి పాల్పడ్డాడా.. అమాయకులను చేసి మిగతా వాళ్లను కలుపుకొని బరితెగించాడా?
హైదరాబాద్ పెద్దాసుపత్రి గాంధీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చుట్టూ పక్కల ఉన్న అన్ని రాష్ట్రల ప్రజలు వచ్చి చికిత్స చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రి. నిత్యం వందల మంది రోగులు వచ్చి వెళ్తూ ఉండే ప్రదేశం. రాజధాని నడిబొడ్డున ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఒక అమానుష ఘటన జరిగింది. రోడ్లు, మందిరాలు, థియేటర్లలోనే కాదు ఆఖరికి ఆసుపత్రుల్లో కూడా మహిళలపై కామంధులు రెచ్చిపోతున్నారు. మూత్రపిండాలు పాడైన బావను తీసుకొని, అక్కకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన అక్కా-చెల్లెల్లపై ఐదుగురు దుర్మార్గులు సాముహిక అత్యాచారం జరగటం అది ఆలస్యంగా వెలుగులోకి రావటం నగరంలో కలకలం రేపుతుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన నర్సింహులు అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. వచ్చేప్పుడు భార్య, ఆమె చెల్లి కూడా వెంట వచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ అనే వ్యక్తిది కూడా నర్సింహులు వాళ్ల ఊరే. అయితే, అతను ఉన్నాడన్న భరోసాతో నర్సింహులు కుటుంబంతో ట్రీట్‌మెంట్ కోసం వచ్చాడు. ఈ నెల 11వ తేదీన అతనికి కిడ్నీ సంబంధిత ట్రీట్‌మెంట్ జరిగింది. కానీ, తీరా అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన భార్య, చెల్లెలు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు నర్సింహులు.
ఇదిలావుంటే, హైదరాబాద్‌లో మిస్సయిన నర్సింహులు మరదలు మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర తేలింది. ఏమైందమ్మా.. అని ప్రశ్నిస్తే తనను, తన అక్కను కిడ్నాప్ చేశారని, కొందరు లైంగికంగా వేధించారని, అత్యారానికి పాల్పడ్డారని చెప్పింది. ఏదోలా వాళ్ల నుంచి తప్పించుకుని బయటపడ్డానని లబోదిబోమంది. మిస్సయిన ఆమె అక్క జాడ మాత్రం ఇంకా తెలియలేదు. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్‌నగర్‌లో జీరో FIR రికార్డ్ చేసి, కేసును హైదరాబాద్‌లోని చిలకలగూడ స్టేషన్‌కు మార్చారు
అయితే, నర్సింహులు భార్యకు, ఆమె చెల్లెల్లికి కల్లు తాగే అలవాటు ఉంది. ఆ అలవాటు తెలిసింది ఉమామహేశ్వర్‌కి మాత్రమే. ఆ వ్యసనాన్ని అసరాగా తీసుకుని వాళ్లతో కల్లు తాగించి తీసుకెళ్లారా? ఒక్కడేనా.. అతనితోపాటు ఇంకా ఎవరైనా అత్యారాలకు పాల్పడ్డారా? అసలు గాంధీ నుంచి వాళ్లను ఎక్కడికి తీసుకెళ్లారు. బాధిత మహిళ మహబూబ్‌నగర్ వరకూ ఎలా వెళ్లింది? ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రస్తుతం ఉమామహేశ్వర్ మాత్రమే. కేసులో అతని రోల్ దాదాపు కన్‌ఫామ్ అయినట్లే కనిపిస్తోంది. కాకపోతే అతనితోపాటు ఇంకా ఎవరన్నదానికోసం ఎంక్వైరీ జరుగుతోంది. మరోవైపు, ఇంకా జాడలేని నర్సింహులు భార్య కోసం కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా భాదితురాలి ఫిర్యాదు తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఉమామహేశ్వర్‌పై రేప్ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు ఉమామహేశ్వర్ తో పాటు మిగతా నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఈ నెల 7 వ తీదీ నుండి 15 వ తేదీ వరకి అక్క-చెల్లెలు ఎక్కడున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కోన సాగిస్తున్నారు. ఐదు రోజులుగా ఉమామహేశ్వర్ విధులకు సరిగ్గా హాజరు కావట్లేదని.. వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి కంగారుగా వెళ్లిపోతున్నాడని, తోటి ఉద్యోగులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ వివరాల మేరకు పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.