Phone Tapping: వామ్మో..! ఎవరిని వదల్లేదుగా.. దర్యాప్తులో వెలుగులోకి మరో సంచలనం..!
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించి నల్లగొండలోనే వార్ రూమ్ సెంటర్ నిర్వహించి ట్యాపింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ప్రకంపనలు రేపుతోంది. సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు తోపాటు తిరుపతన్న, భుజంగరావులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే తొలుత పనిచేశారు. తాజాగా నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇంకా ఎవరెవరు బయటకు వస్తారోననే ఉత్కంఠ పోలీస్ శాఖలో నెలకొంది.
ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి దర్యాప్తు బృందం..
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన విపక్ష నేతల ఫోన్లను ప్రణీత్‌రావు, ఇతర అధికారులు ట్యాప్ చేసినట్లుగా విచారణలో తేలింది. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించి నల్లగొండలోనే వార్ రూమ్ సెంటర్ నిర్వహించి ట్యాపింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్ రూమ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నికలో అప్పటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన డబ్బులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ బృందం.. తమ వాహనాల్లో డబ్బు తరలింపు, కాంగ్రెస్ నేతలు, అనుచరుల ఫోన్లను ట్యాపింగ్ చేసి కట్టడి చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ట్యాపింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ముగ్గురు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అయితే దర్యాప్తు బృందం ఇద్దరు కానిస్టేబుల్స్‌ను మాత్రమే హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలిసింది. నల్లగొండలో వార్ రూమ్‌కు ఎవరు సహకరించారన్న దానిపై విచారణ బృందం ఆరా తీస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ట్యాపింగ్ బృందంలో పని చేసిన వారి పాత్ర ఎంత అనే అంశాన్ని దర్యాప్తు బృందం సిబ్బంది ద్వారా విచారిస్తోంది.
రాజకీయ నేతలు, వ్యాపారులు, రైస్ మిల్లర్లే టార్గెట్ గా..
నల్లగొండలో ఏర్పాటు చేసిన వార్ రూమ్.. కాంగ్రెస్ నేతలు, రైస్ మిల్లర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పరిశ్రమల యజమానుల టార్గెట్‌గా పనిచేసినట్టుగా దర్యాప్తు బృందం గుర్తించింది. వివక్ష పార్టీలకు ఆర్థిక సహకారం అందించే బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ చేశారట.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనే వివరాలతో పాటు ఎక్కడ ఎంత నగదును పట్టుకున్నారనే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ భూమ్‌లో కీలకమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భూముల క్రయ విక్రయాలపై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రధాన నిందితులు.. ఉమ్మడి జిల్లాలో పనిచేసిన అధికారులే..!
పోలీసు శాఖతో పాటు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు అధికారులు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 2015లో నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నల్లగొండలో ఓఎస్డీగా పని చేశారు. ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్‌ఐలుగా పనిచేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు.. ఎస్సైగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు. సీఐ గట్టు మల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఇక్కడ పనిచేసిన సమయంలోనే వీరి మధ్య సంబంధాలు ఏర్పడి మళ్లీ ఒక్కటై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నలుగురు పోలీస్ అధికారులతో అప్పట్లో సన్నిహితంగా మెలిగిన పోలీస్ సిబ్బంది ఉలిక్కి పడుతున్నారు.
మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులను తాకడంతో కలకలం రేపుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..