Telangana: డిసెంబరులో నగర భేరి.. జీహెచ్‌ఎంసీ, వరంగల్ ఎన్నికలకు సర్కార్ కసరత్తు!
తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఇతర వాయిదా పడిన పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జీహెచ్‌ఎంసీని హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్‌గా పునర్‌వ్యవస్థీకరించడం, 'సర్' ప్రక్రియ కారణంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. అక్టోబర్ 19 తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు, పరిపాలన సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరు నెలలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతో పాటు ఎన్నికలు వాయిదా పడిన ఇతర పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో పురపాలక శాఖ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటికి జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం పూర్తికాకపోవడంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. కొన్ని ప్రత్యేక కారణాలతో మందమర్రి, మణుగూరు, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగలేదు.
జీహెచ్‌ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగిసిన అనంతరం ప్రభుత్వం దానిని మూడు కార్పొరేషన్లుగా పునర్‌వ్యవస్థీకరించింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలను కలుపుతూ మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ పునర్‌వ్యవస్థీకరణ కారణంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ కొనసాగుతుండటంతో అధికారులు దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్టోబర్ 19 నాటికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండటంతో, ఆ తర్వాత కొంత సమయం తీసుకుని డిసెంబరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వాతావరణ పరిస్థితులు, పరిపాలనా సన్నద్ధత, ప్రజలకు ఇబ్బందులు తగ్గించే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
