Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు భారీ అలర్ట్.. ఈ నెల 9 వరకే డెడ్ లైన్.. ఇది మర్చిపోతే ఇల్లు రద్దు..!
హైదరాబాద్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు సంబంధించి ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఇల్లు మంజూరైన వారికి పేమెంట్ చేసేందుకు అక్టోబర్ 9 వరకు సమయం ఇచ్చింది. ఆలోపు చెల్లించకపోతే ఇళ్లను రద్దు చేసే అవకాశముంది. దీంతో అధికారులు లబ్దిదారులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ ప్రజలకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి లాటరీ నిర్వహించారు. లాటరీలో ఇల్లు దక్కినవారికి మంజూరు పత్రాలు అందజేశారు. క్యూఆర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలకు తొలి విడత ఇళ్లను మంజూరు చేశారు. మొత్తం 5501 మందికి తాత్కాలిక కేటాయింపు పత్రాలు పంపిణీ చేయగా.. వీళ్లు తొలుత రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 3271 మంది వీటిని చెల్లించగా.. మిగతా లబ్దిదారులు ఇంకా చెల్లింపులు జరపలేదు. మిగతా 59.46 శాతం మంది నిధులు చెల్లించేందుకు డేట్ ఫిక్స్ చేశారు.
మిగతా లబ్దిదారులు అక్టోబర్ 9వ తేదీలోపు రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించాలి. లేని పక్షంలో తాత్కాలిక కేటాయింపు పత్రాన్ని రద్దు చేయనున్నారు. ఇదే జరిగితే లబ్దిదారులు తమకు మంజూరైన ఇల్లు కోల్పోనున్నారు. వారి స్థానంలో అర్హులైన మరొకరికి ఇంటిని కేటాయిస్తారు. దీంతో పేమెంట్ చేయనివారు వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 9వ తేదీలోగా పూర్తి చేయాలని కోరుతున్నారు. లబ్దిదారుల వాటా కింద తొలి విడత రూ.లక్ష చెల్లించిన తర్వాత పనులు మొదలుకానున్నాయి. లబ్దిదారులు విడతల వారీగా తమ వాటాను చెల్లించాల్సి ఉంటుంది. తొలి విడత వాటా చెల్లించిన తర్వాత.. రెండో విడత వాటాకు మరికొంత సమయం ఉంటుంది. గతంలోనే తొలి విడత వాటా గడువు ముగియగా.. అధికారులు మరింత సమయం ఇచ్చారు. దీంతో ఇల్లు మంజూరైన నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
చెల్లింపులు చేసేముందు బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ వివరాలను సరిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వర్చువల్ అకౌంట్, నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర డిజిటల్ విధానాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అకౌంట్ వివరాలు తప్పుగా నమోదు చేస్తే పేమెంట్ ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. అలాగే పేమెంట్ పూర్తయిన తర్వాత స్లిప్‌ను భద్రంగా దాచుకోవాలి. ఏమైనా సందేహాలుంటే 040-24603572 నెంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. ఇక https://tghb.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా సమాచారం పొందవచ్చు. అయితే ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ కోసం సుమారు 35 వేల మంది అర్హులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. రెండో విడత ఇళ్ల కేటాయింపుల్లో వీరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అటు ఈ ఆర్దిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి కేటాయించనున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు తొలి విడతలో మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు వాటి స్టేటస్ గురించి సమాచారం సేకరిస్తున్నారు.
