AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ పాట పెట్టడానికి కారణం ఇదే

MS Dhoni CSK IPL retirement: మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించారు. 2027 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నారు. వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ నటించిన కభీ కభీ సినిమాలోని పాత పాటను ఉపయోగించారు.

MS Dhoni: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. వీడ్కోలు పోస్ట్‌లో అమితాబ్ పాట పెట్టడానికి కారణం ఇదే
Ms Dhoni Retirement Song
Rakesh
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 11:28 AM

Share

MS Dhoni CSK: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికారు. నవంబర్ 17న చెన్నై సూపర్ కింగ్స్(CSK) యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి ధోనీ సీఎస్కే జట్టుకు టీమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నీలో కొనసాగిన ధోనీ.. దాదాపు 19 ఏళ్ల అనుబంధానికి తెరదించారు. అయితే 2026 సీజన్‌లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇకపై మైదానంలో ఆటగాడిగా కనిపించకపోయినా, జట్టుతో ఆయన అనుబంధం కొనసాగనుంది.

రిటైర్మెంట్ పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ పాట

రిటైర్మెంట్ ప్రకటన తర్వాత ధోనీ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. అందులో 1976లో విడుదలైన అమితాబ్ బచ్చన్ సినిమా కభీ కభీలోని మై పల్ దో పల్ కా షాయర్ హూన్ పాటను ఉపయోగించారు. ముఖేష్ ఆలపించిన ఈ పాటకు సాహిర్ లుధియాన్వీ సాహిత్యం అందించగా, ఖయ్యామ్ సంగీతం సమకూర్చారు. జీవితంలో ప్రతి క్షణం శాశ్వతం కాదనే భావనను ఈ పాట గుర్తుచేస్తుంది. ఐపీఎల్‌లో తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతున్న సమయంలో ఈ పాటను ఎంచుకోవడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.

ఫ్యాన్స్ నన్ను తప్పని నిరూపించారు

పాటతో పాటు ధోనీ రాసిన క్యాప్షన్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్స్ నన్ను తప్పని నిరూపించారు. ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇంతకంటే మంచి పాట లేదు. బహుశా రెండు వెర్షన్లు ఉండటంతోనే నేను తప్పు చేసి, తర్వాత దాన్ని అంగీకరించగలిగాను అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. కభీ కభీ సినిమాలోని ఈ పాటకు సంబంధించిన రెండు వెర్షన్లను ప్రస్తావిస్తూ ధోనీ సరదాగా స్పందించారు. రిటైర్మెంట్‌ను కూడా తనదైన శైలిలో తీసుకున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినప్పుడు కూడా ధోనీ ఇదే పాటను ఉపయోగించినట్లు అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

5,439 పరుగులతో అద్భుత ప్రయాణం

ధోనీ ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 278 మ్యాచ్‌ల్లో 5,439 పరుగులు సాధించారు. సీఎస్కే కెప్టెన్‌గా 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించారు. రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లలోనూ జట్టుకు కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌గా వ్యూహాలు రచించడం, ఒత్తిడిలో మ్యాచ్‌లను ముగించడం, వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకోవడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ధోనీని ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టాయి.

సాక్షి ధోనీ భావోద్వేగ సందేశం

మరోవైపు ధోనీ భార్య సాక్షి కూడా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఇన్నేళ్లుగా ధోనీని ప్రేమించి, ఆదరించి, నమ్మిన అభిమానులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని అధ్యాయాలు ముగిసినప్పుడే అందమైన కొత్త ప్రయాణాలు మొదలవుతాయని పేర్కొన్నారు. కొత్త ఆరంభాలు, కొత్త అనుభవాలు, మరిన్ని మధుర జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతూ.. ధోనీపై గర్వంగా ఉందని రాసుకొచ్చారు. సాక్షి మెసేజ్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇక 2027 నుంచి ఆటగాడిగా కాకుండా మెంటార్‌గా ధోనీ సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండనున్నారు..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us