Watch: కొడుకు మాటలు విని మురిసిపోయిన వీరేంద్ర సెహ్వాగ్.. వీడియో వైరల్
Watch: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ చివరి బంతికి విజయం సాధించిన తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి విరేంద్ర సెహ్వాగ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడాడు. చివరి ఓవర్‌లో ఉత్కంఠగా ఎదురుచూస్తూ సీతారామ్ అంటూ ప్రార్థించానని చెప్పాడు. పాకిస్థాన్ అభిమానులు సెహ్వాగ్ అంటూ తనను ప్రోత్సహించారని వెల్లడించాడు.

Watch: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ చివరి బంతికి ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత యువ జట్టు తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆడిన యువ బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో ఎదురైన ఉత్కంఠ, పాకిస్థాన్ అభిమానుల నుంచి లభించిన మద్దతు గురించి ఆర్యవీర్ తండ్రికి వివరించాడు. ఈ వీడియోను వీరేంద్ర సెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
చివరి ఓవర్‌లో సీతారామ్ జపం
ఫైనల్ మ్యాచ్ చివరి దశలో భారత్ గెలుస్తుందో లేదోనని తాను ఎంతో ఆందోళనకు గురయ్యానని ఆర్యవీర్ చెప్పాడు. చివరి ఓవర్‌లో భారత్‌కు ఎనిమిది పరుగులు అవసరమయ్యాయని, చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో దాదాపు గంటసేపు మనసులోనే ‘సీతారామ్.. సీతారామ్’ అంటూ ప్రార్థించానని తెలిపాడు. చివరి బంతిని మహిత్ ఉల్వా బౌండరీకి తరలించడంతో భారత్ విజయం సాధించిందని, ఆ క్షణం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తండ్రితో చెప్పాడు.
పాకిస్థాన్ అభిమానుల నుంచి ఊహించని మద్దతు
ఈ మ్యాచ్‌లో తనకు ఎదురైన మరో ఆసక్తికర అనుభవాన్ని కూడా ఆర్యవీర్ వివరించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన చేతికి బంతి తగిలి గాయమైందని, అప్పుడు ఫిజియో రెండు మూడు సార్లు మైదానంలోకి వచ్చారని చెప్పాడు. స్టేడియంలో దాదాపు 2 వేల మంది పాకిస్థాన్ అభిమానులు ఉన్నారని, వారంతా తనను ‘సెహ్వాగ్.. సెహ్వాగ్’ అంటూ ప్రోత్సహించారని వెల్లడించాడు. తాను బాగా బ్యాటింగ్ చేస్తున్నానంటూ వారు అభినందించారని చెప్పాడు. ప్రత్యర్థి జట్టు అభిమానుల నుంచి ఇలాంటి మద్దతు లభించడం చాలా సంతోషంగా అనిపించిందని ఆర్యవీర్ తన తండ్రితో పంచుకున్నాడు.
టోర్నీలో అత్యధిక పరుగులు
ఈ టోర్నీలో ఆర్యవీర్ అద్భుతంగా ఆడాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతడి బ్యాటింగ్ సగటు 90.25గా ఉంది. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగులు చేయడం అతడి టోర్నీ అత్యుత్తమ ప్రదర్శన. మలేషియాపై అజేయంగా 70 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ప్రదర్శనతో ఆర్యవీర్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది.
ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్
పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఆర్యవీర్ 61 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో పాక్ బౌలర్ అలీ రజా వేసిన బంతి అతడి చేతి ముంజేతికి తగిలింది. గాయంతో ఇబ్బంది పడినా బ్యాటింగ్ కొనసాగించాడు. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానితో కలిసి తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్ అనంతరం తండ్రితో వీడియో కాల్‌లో మాట్లాడిన ఆర్యవీర్.. గాయానికి పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని చెప్పాడు. కొడుకు సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. కష్టపడి ఆడి మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. అవార్డులు, పరుగుల కంటే ఇలాంటి జ్ఞాపకాలే తండ్రికి ఎంతో విలువైనవని తన పోస్టులో పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
