AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫంగస్‌ను చంపకుండానే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చు.. హైదరాబాద్ శాస్త్రవేత్తల కీలక పరిశోధన!

హైదరాబాద్‌లోని CCMB శాస్త్రవేత్తలు కాండిడా అల్బికాన్స్ ఫంగస్‌పై కీలక పరిశోధన చేశారు. ఫంగస్‌ను చంపకుండానే ఇన్ఫెక్షన్ కలిగించే రూపంలోకి మారకుండా అడ్డుకునే రెండు సమ్మేళనాలను గుర్తించారు. ఇవి బయోఫిల్మ్ ఏర్పాటును తగ్గించడంతో పాటు యాంటీ ఫంగల్ మందుల ప్రభావాన్ని పెంచినట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. అయితే మనుషుల్లో చికిత్సకు అందుబాటులోకి రావాలంటే మరిన్ని పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు అవసరం.

ఫంగస్‌ను చంపకుండానే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చు.. హైదరాబాద్ శాస్త్రవేత్తల కీలక పరిశోధన!
Ccmb Hyderabad Research
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 11:14 AM

Share

వ్యాధులకు కారణమయ్యే ఫంగస్‌ను పూర్తిగా చంపకుండా.. అది మనిషి శరీరంలో ఇన్ఫెక్షన్ కలిగించకుండా అడ్డుకోవచ్చని హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధకులు ఈ దిశగా కీలక ముందడుగు వేశారు. ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే కాండిడా అల్బికాన్స్ ఫంగస్ వ్యాధికారక రూపంలోకి మారకుండా నిరోధించే రెండు సమ్మేళనాలను గుర్తించారు. ఈ పరిశోధన భవిష్యత్తులో యాంటీ ఫంగల్ ఔషధాల నిరోధకత సమస్యను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలను తెరిచే అవకాశం ఉంది.

డాక్టర్ శ్రీరామ్ వరహన్ నేతృత్వంలోని పరిశోధక బృందం కాండిడా అల్బికాన్స్ అనే ఫంగస్‌పై అధ్యయనం చేసింది. ఈ ఫంగస్ సాధారణంగా మనిషి చర్మంపై ఉంటుంది. అయితే రక్తప్రవాహంలోకి లేదా అంతర్గత అవయవాల్లోకి ప్రవేశించినప్పుడు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఈ ఫంగస్ తన రూపాన్ని మార్చుకోగలగడం దాని వ్యాధికారక లక్షణాల్లో ముఖ్యమైనది. సాధారణంగా గుండ్రటి కణాలుగా ఉండే ఇది.. పొడవైన దారాల వంటి నిర్మాణాలుగా మారుతుంది. వీటినే ఫిలమెంట్స్ అంటారు. ఈ రూపం ద్వారా శరీర కణజాలాల్లోకి చొచ్చుకెళ్లడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందుతుంది.

సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఫంగస్‌ను చంపే ఔషధాలను ఉపయోగిస్తారు. అయితే ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు భిన్నమైన విధానాన్ని అనుసరించారు. ఫంగస్‌ను చంపడం కాకుండా.. అది వ్యాధిని కలిగించే రూపంలోకి మారకుండా అడ్డుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం గ్లైకోలిసిస్ అనే జీవక్రియ ప్రక్రియను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రక్రియలో కణాలు చక్కెరను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. గతంలోనే ఈ ప్రక్రియ ఫంగస్ రూపాంతరాన్ని కూడా నియంత్రిస్తుందని పరిశోధక బృందం గుర్తించింది.

గ్లైకోలిసిస్‌ను లక్ష్యంగా చేసుకునే చిన్న అణువుల సమ్మేళనాలను పరిశీలించిన పరిశోధకులు.. ఫంగస్ ఫిలమెంట్లుగా మారడాన్ని సమర్థంగా అడ్డుకునే రెండు సమ్మేళనాలను గుర్తించారు. ఈ సమ్మేళనాల ప్రభావంతో ఫంగస్ పెరుగుదల కొనసాగినప్పటికీ.. అది గుండ్రటి కణాల రూపంలోనే ఉండిపోయింది. అంటే ఫంగస్‌ను పూర్తిగా చంపకుండానే దాని వ్యాధికారక లక్షణాన్ని నియంత్రించవచ్చని ప్రయోగాల్లో వెల్లడైంది. గ్లైకోలిసిస్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే పైరువేట్ కినేస్ అనే ఎంజైమ్‌ను కూడా ఈ రూపాంతర నియంత్రణకు ముఖ్యమైన లక్ష్యంగా గుర్తించారు.

ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించిన ఒక సమ్మేళనం ఫంగస్ బయోఫిల్మ్ ఏర్పాటును కూడా తగ్గించింది. బయోఫిల్మ్‌లు ఫంగస్ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడి.. ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడాన్ని మరింత కష్టతరం చేస్తాయి. అంతేకాకుండా ఈ సమ్మేళనం కారణంగా ఫ్లూకోనజోల్, యాంఫోటెరిసిన్-బి వంటి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీ ఫంగల్ మందులకు ఫంగస్ మరింత సున్నితంగా మారినట్లు గుర్తించారు.

పరిశోధకులు గుర్తించిన ప్రధాన సమ్మేళనాన్ని కాండిడా ఫంగస్ వల్ల వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న ఎలుకలపై కూడా పరీక్షించారు. ఈ ప్రయోగాల్లో ఎలుకల మనుగడ గణనీయంగా మెరుగుపడినట్లు గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన అధ్యయనంలో మొదటి రచయిత ధ్రుమి షా మాట్లాడుతూ.. ఫంగస్ పెరుగుదలను పూర్తిగా ఆపకుండానే దాని వ్యాధికారక ప్రవర్తనను లక్ష్యంగా చేసుకోవచ్చని తమ పరిశోధన సూచిస్తోందని తెలిపారు. డాక్టర్ శ్రీరామ్ వరహన్ మాట్లాడుతూ.. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నియంత్రించేందుకు జీవక్రియ మార్గాలను లక్ష్యంగా చేసుకునే పరిశోధనలకు ఈ సమ్మేళనాలు మంచి ప్రారంభమని పేర్కొన్నారు.

అయితే ఈ సమ్మేళనాలు ప్రస్తుతం పరిశోధన దశలోనే ఉన్నాయి. మనుషుల్లో చికిత్సకు ఉపయోగపడతాయని నిర్ధారించేందుకు మరిన్ని అధ్యయనాలు, క్లినికల్ పరీక్షలు అవసరం.

Follow Us