AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెక్ ఉద్యోగులకు కోట్లలో జీతాలు.. ఏడాదికి రూ.4.3 కోట్లు సంపాదిస్తున్న భారతీయ టెక్కీలు!

భారతదేశంలోని టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏడాదికి కోట్ల రూపాయల ప్యాకేజీలు అందుకుంటున్నారు. వర్క్‌ప్లేస్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ బ్లైండ్ విడుదల చేసిన 2026 నివేదిక ప్రకారం.. అత్యధికంగా ఓ టెక్ ఉద్యోగి రూ.4.3 కోట్ల వార్షిక పరిహారం పొందుతున్నారు. టాప్-20లో చివరి స్థానంలో ఉన్న ఉద్యోగి ప్యాకేజీ కూడా రూ.1.7 కోట్లుగా ఉంది. మెటా, ఉబర్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భారీ ప్యాకేజీల వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి..

టెక్ ఉద్యోగులకు కోట్లలో జీతాలు.. ఏడాదికి రూ.4.3 కోట్లు సంపాదిస్తున్న భారతీయ టెక్కీలు!
Top 20 Highest Paid Tech Employees In India
Srilakshmi C
|

Updated on: Nov 18, 2026 | 9:59 AM

Share

సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం సాధిస్తే లక్షల్లో జీతం వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ ప్రముఖ అంతర్జాతీయ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు భారతీయ టెక్నాలజీ నిపుణులు మాత్రం ఏకంగా కోట్ల రూపాయల వార్షిక ప్యాకేజీలు అందుకుంటున్నారు. ఏడాదికి అత్యధికంగా రూ.4.3 కోట్ల వరకు పరిహారం పొందుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. టాప్-20లో చివరి స్థానంలో ఉన్న ఉద్యోగి కూడా ఏడాదికి రూ.1.7 కోట్ల ప్యాకేజీ అందుకుంటుండటం విశేషం.

వర్క్‌ప్లేస్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ బ్లైండ్ (Blind) విడుదల చేసిన ‘India Salary 2026: Top 20 Total Compensation Packages’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీతాలు, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన వివరాలను ఈ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్న సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని టాప్-20 టెక్ ఉద్యోగుల మొత్తం వార్షిక పరిహారం రూ.1.7 కోట్ల నుంచి రూ.4.3 కోట్ల మధ్య ఉంది. అయితే ఇవి కేవలం ఫిక్స్‌డ్ జీతాలు మాత్రమే కావు. బేస్ శాలరీతో పాటు బోనస్‌లు, స్టాక్ అవార్డులు, ఇతర ప్రయోజనాలు కలిపిన మొత్తం పరిహార ప్యాకేజీలు.

అత్యధికంగా రూ.4.3 కోట్ల ప్యాకేజీ

ఈ జాబితాలో మెటా (Meta) కంపెనీలో పనిచేస్తున్న ఎం2 మేనేజర్ మొదటి స్థానంలో ఉన్నారు. 14 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన వార్షిక మొత్తం పరిహారం రూ.4.3 కోట్లుగా నమోదైంది. రెండో స్థానంలో ఉబర్ (Uber) కంపెనీకి చెందిన ప్రిన్సిపల్ స్థాయి ఉద్యోగి ఉన్నారు. 12 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ప్యాకేజీ రూ.3.85 కోట్లు. వాల్‌మార్ట్‌లో డైరెక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రూ.3.25 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఎన్విడియా ఉద్యోగి రూ.3.23 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, అమెజాన్ సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ రూ.3.2 కోట్ల ప్యాకేజీతో ఐదో స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

టాప్-20లో ఉన్న ప్రముఖ కంపెనీలు ఇవే..

ఈ జాబితాలో మెటా, ఉబర్, వాల్‌మార్ట్, ఎన్విడియా, అమెజాన్, గూగుల్, ఎయిర్‌బీఎన్‌బీ, లింక్డ్‌ఇన్, రిప్లింగ్, మైక్రోసాఫ్ట్, కాన్‌ఫ్లుయెంట్, స్ట్రైప్, గ్రాబ్, గోల్డ్‌మన్ సాక్స్, అట్లాసియన్, సేల్స్‌ఫోర్స్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. గూగుల్‌లో స్టాఫ్ స్థాయి ఉద్యోగి రూ.3.1 కోట్లు, ఎయిర్‌బీఎన్‌బీలో పనిచేస్తున్న స్టాఫ్ ఉద్యోగి రూ.3.05 కోట్ల ప్యాకేజీ పొందుతున్నారు. ఉబర్‌లోని మరో స్టాఫ్ ఉద్యోగి రూ.2.5 కోట్లు, ఇంజినీరింగ్ మేనేజర్ రూ.2.3 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రూ.2.2 కోట్లు, స్ట్రైప్ ఉద్యోగి రూ.2 కోట్లు, గోల్డ్‌మన్ సాక్స్‌లోని క్వాంట్ ఉద్యోగి రూ.1.9 కోట్ల పరిహారం పొందుతున్నారు. ఈ జాబితాలో 20వ స్థానంలో ఉన్న ఉద్యోగి ప్యాకేజీ కూడా రూ.1.7 కోట్లుగా ఉంది.

ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అత్యధిక ప్యాకేజీలు పొందుతున్న టాప్-20 ఉద్యోగులకు సగటున 12 ఏళ్ల పని అనుభవం ఉంది. వీరిలో ఎక్కువ మంది స్టాఫ్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ మేనేజర్లు, డైరెక్టర్ స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ స్థాయి ఉద్యోగులకు కేవలం కోడింగ్ పరిజ్ఞానం ఉంటే సరిపోదు. క్లిష్టమైన సాంకేతిక నిర్ణయాలు తీసుకోవడం, పెద్ద బృందాలకు నాయకత్వం వహించడం, కీలక ప్రాజెక్టులను నిర్వహించడం వంటి బాధ్యతలు కూడా ఉంటాయి. అందుకే అనుభవం, నైపుణ్యం, నాయకత్వ సామర్థ్యాలకు అంతర్జాతీయ టెక్ కంపెనీలు భారీ ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఈ వివరాలు ప్రధానంగా బెంగళూరు టెక్ ఉద్యోగుల జీతాలపై జరిగిన చర్చకు సంబంధించినవిగా నివేదిక పేర్కొంది. భారతదేశంలోని అతిపెద్ద టెక్నాలజీ ఉద్యోగ కేంద్రాల్లో బెంగళూరు ఒకటి. గ్లోబల్ కంపెనీల కార్యకలాపాలు, భారీ టెక్ ఉద్యోగ అవకాశాలతో ఈ నగరం ప్రత్యేక గుర్తింపు పొందింది. టెక్నాలజీ రంగంలో నైపుణ్యం, అనుభవం, నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి అంతర్జాతీయ కంపెనీల్లో కోట్ల రూపాయల ప్యాకేజీలు అందే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Follow Us