AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొదల్లో మనిషి కాలు.. పక్కనే పెంపుడు కుక్క మృతి.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఓ వింత, భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్ కాలనీలోని ఇళ్ల మధ్య ఉన్న పొదల్లో గుర్తుతెలియని వ్యక్తికి చెందిన తెగిపడిన కాలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అంతేకాదు, ఆ కాలు కనిపించిన కొద్దిసేపటికే సమీపంలోనే ఓ పెంపుడు కుక్క అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఈ ఘటనను మరింత మిస్టరీగా మార్చింది.

పొదల్లో మనిషి కాలు.. పక్కనే పెంపుడు కుక్క మృతి.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!
Mysteriously In Ibrahimpatnam
Balaraju Goud
|

Updated on: Nov 18, 2026 | 9:29 AM

Share

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఓ వింత, భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్ కాలనీలోని ఇళ్ల మధ్య ఉన్న పొదల్లో గుర్తుతెలియని వ్యక్తికి చెందిన తెగిపడిన కాలు కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అంతేకాదు, ఆ కాలు కనిపించిన కొద్దిసేపటికే సమీపంలోనే ఓ పెంపుడు కుక్క అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఈ ఘటనను మరింత మిస్టరీగా మార్చింది.

వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం (నవంబర్ 17) సాయంత్రం గాంధీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ విధులకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుండగా, పక్కనే ఉన్న పొదల్లో ఎర్రగా ఏదో పడి ఉండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది మనిషి తెగిపోయిన కాలు అని గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆ కాలు కొంతవరకు కాలిపోయి ఉండటంతో పాటు, మాంసం తొలగిపోయి ఎముక బయటకు కనిపిస్తోంది. ఉదయం ఆ ప్రాంతంలో చెత్త వేసినప్పుడు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, అదే ప్రాంతానికి సమీపంలో పిల్లల కోసం పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా అనుమానాస్పదంగా మృతి చెందింది. మధ్యాహ్నం నుంచే కుక్క వణుకుతూ అస్వస్థతకు గురైందని, యజమానులు డోలో టాబ్లెట్, ఓఆర్ఎస్ నీళ్లు ఇచ్చినట్లు తెలిపారు. అయితే మనిషి కాలు కనిపించిన 10 నుంచి 20 నిమిషాల్లోనే కుక్క ప్రాణాలు విడిచింది. దీంతో కుక్క ఆ కాలి భాగాన్ని తాకడం, తినడం వల్ల ఏదైనా విషప్రభావం కలిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కుక్క మృతికి, మనిషి కాలుకు మధ్య సంబంధం ఉందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రాథమికంగా స్వాధీనం చేసుకున్న కాలు వివాహిత మహిళకు చెందిన ఎడమ కాలుగా గుర్తించారు. సమీపంలోని శ్మశానవాటిక నుంచి వీధి కుక్కలు మృతదేహం నుంచి కాలును తీసుకొచ్చాయా? లేక ఎవరైనా హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా మృతదేహాన్ని ముక్కలుగా చేసి కాల్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న కాలును ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా శరీర భాగాల ఆచూకీ, మృతురాలి గుర్తింపు, అసలు మరణానికి గల కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక ఉన్న అసలు మిస్టరీ ఎప్పుడు వీడుతుందోనని గాంధీనగర్ కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us