AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే పంట.. ఇద్దరు రైతులు.. కానీ ఆదాయంలో భారీ తేడా! MSP వెనుక అసలు వాస్తవాలివే!

ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచుతున్నా ప్రతి రైతుకు ఆ ప్రయోజనం అందుతోందా? కొనుగోలు కేంద్రాల దూరం, రవాణా ఖర్చులు, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాంతీయ అసమానతలు రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. MSPకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనే డిమాండ్, ఆర్థిక భారం, ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అసలు క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

ఒకే పంట.. ఇద్దరు రైతులు.. కానీ ఆదాయంలో భారీ తేడా! MSP వెనుక అసలు వాస్తవాలివే!
Minimum Support Price
Santosh Nair
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 11:43 AM

Share

ఒకే జిల్లాలో పత్తి పండిస్తున్న ఇద్దరు రైతులు, ఒకే సీజన్‌లో రేడియోలో ఒకే వార్త విన్నారు.. “ప్రభుత్వం మద్దతు ధర పెంచింది” అని. వారిలో మొదటివాడు భీమ్‌రావ్. అతని గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉంది. తెల్లవారుజామునే బండిపై పత్తిని లోడ్ చేసుకుని వెళ్లి, మధ్యాహ్నానికల్లా ప్రకటించిన మద్దతు ధర తాలూకు రసీదును జేబులో వేసుకుని ఇంటికి తిరిగొచ్చాడు.

రెండోవాడు ధన్‌రాజ్. అతని ఊరికి వంద కిలోమీటర్ల వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రం లేదు. సొంత బండి లేదు, పైగా స్థానిక వ్యాపారి దగ్గర అప్పు ఉంది. అదే రోజు మధ్యాహ్నం ఆ వ్యాపారి ధన్‌రాజ్ ఇంటి గేటు ముందు వాలి.. “మార్కెట్ పడిపోయింది” అంటూ తక్కువ ధర చెప్పాడు. గత్యంతరం లేక ధన్‌రాజ్ ఆ ధరకే పంటను అమ్ముకున్నాడు. ఇద్దరూ సమానంగానే కష్టపడ్డారు.. కానీ ఆ ఏడాది వారి ఆదాయాన్ని నిర్ణయించింది మాత్రం వారి ఊరికి కొనుగోలు కేంద్రం ఎంత దూరంలో ఉందన్న భౌగోళిక వాస్తవమే!

అసలు కనీస మద్దతు ధర (MSP) ఉద్దేశం ఏమిటి?

ప్రతి ఏటా విత్తనాలు వేసే ముందే వరి, గోధుమ, పత్తి సహా 22 పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (CACP) సిఫార్సుల మేరకు ఈ ధరలను నిర్ణయిస్తారు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం నెలల ముందే పెట్టుబడి పెట్టి, వర్షాల కోసం వేచి చూసే రైతుకు—పంట చేతికొచ్చాక మార్కెట్ ధరలు పడిపోతే ఏడాది కష్టమంతా ఆవిరైపోకుండా కాపాడే రక్షణ కవచమే ఈ MSP. 1960ల నుండి భారతదేశం ఈ విధానాన్ని అనుసరిస్తోంది.

క్షేత్రస్థాయి వాస్తవాలు – గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న ఫలాలకు మధ్య భారీ అంతరం ఉందని జాతీయ గణాంక కార్యాలయం (NSO) నిర్వహించిన సర్వే (2018-19) స్పష్టం చేస్తోంది:

ముఖ్యాంశం గణాంకాలు & క్షేత్రస్థాయి వాస్తవాలు
అవగాహన లేమి వరి పండించే రైతు కుటుంబాలలో కేవలం 41% మందికి, గోధుమ రైతుల్లో 37% మందికి మాత్రమే తమ పంటకు MSP ఉందన్న విషయం తెలుసు. అంటే దాదాపు 60% మంది రైతులకు ఆ సమాచారమే చేరడం లేదు.
వాస్తవ కొనుగోళ్లు వరి పండించే రైతుల్లో కేవలం నలుగురిలో ఒకరు (25%) మాత్రమే తమ పంటలో కొంత భాగాన్ని MSPకి అమ్ముకోగలిగారు. మిగతా పంటల విషయంలో ఈ శాతం ఇంకా తక్కువగా ఉంది.
ప్రాంతీయ అసమానతలు ప్రభుత్వ కొనుగోళ్లు ప్రధానంగా రేషన్ వ్యవస్థకు అవసరమైన వరి, గోధుమలకే పరిమితమయ్యాయి. అవి కూడా పంజాబ్, హర్యానా, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి.

ప్రకటించిన ధర వేరు, ప్రభుత్వం కొనుగోలు చేయడం వేరు. పంజాబ్‌లోని గోధుమ రైతుకు MSP ఒక నమ్మకమైన ఆదాయం అయితే, మారుమూల జిల్లాలో పప్పుధాన్యాలు పండించే రైతుకు అది కేవలం పేపర్లలో కనిపించే ఒక అంకె మాత్రమే!

MSPకి చట్టబద్ధత: రైతుల డిమాండ్ vs ఆర్థికవేత్తల వాదనలు

ప్రభుత్వం మారినప్పుడల్లా మారే హామీలా కాకుండా, MSPకి చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి:

సవాళ్లు – ఆర్థిక భారం: అన్ని పంటలను ప్రభుత్వమే MSPకి కొనుగోలు చేయాల్సి వస్తే ఖజానాపై మోయలేని ఆర్థిక భారం పడుతుందని, అదనపు ధాన్యాన్ని నిల్వ చేయడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఒకే పంటకు స్థిరమైన ధర ఉంటే, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సైతం రైతులు వరి వంటి పంటల వైపే మొగ్గు చూపే ప్రమాదం ఉందని, వినియోగదారులకు ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఆలోచనలు: ప్రభుత్వమే నేరుగా పంటను కొనడానికి బదులు, మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే తగ్గినప్పుడు ఆ మధ్య వ్యత్యాసాన్ని (Price Deficiency Payment) నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆర్థికవేత్తలు చర్చిస్తున్నారు.

ఈ వాదప్రతివాదాల మధ్య అందరూ అంగీకరించే ఒకే ఒక్క సత్యం ఉంది—వర్షాలు, తెగుళ్లు, ఆకస్మిక ధరల పతనం వంటి అతిపెద్ద రిస్కులను మోసే రైతుకు కచ్చితంగా రక్షణ కావాలి. ఆ రక్షణ ఎలా ఉండాలి, ఎవరు భరించాలి అనే దానిపైనే చర్చంతా నడుస్తోంది.

ప్రతి సీజన్‌లో “MSP పెంపు” అనే వార్త పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. కానీ దానికి అసలైన అర్థం దక్కాలంటే మూడు ప్రశ్నలు వేసుకోవాలి: ఏ పంటకు పెంచారు? ఏ రాష్ట్రంలో అమలవుతోంది? ప్రభుత్వం నిజంగా ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తోంది?

మీ రాష్ట్రంలోని రైతులు ఏ పంటలు పండిస్తున్నారు, వారి దగ్గర నుండి ఆ పంటలను ఎవరు కొనుగోలు చేస్తున్నారో మీకు తెలుసా?

ఇలాంటి విషయాలపై అందరూ అవగాహనతో ఉండటం చాలా అవసరం..

Follow Us