KTR on IT Industry Annual Report: తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది.. ఐటీలో రెట్టింపు అయిన ఉద్యోగులు.. మంత్రి కేటీఆర్ వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోందని, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఐటీ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు.
KTR Launch of Annual Report 2020-21 of IT & Industries: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోందని, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఐటీ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయిందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. పారిశ్రామిక రంగాల దిగ్గజాలు కూడ తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందని కేటీఆర్ తెలిపారు. గురువారం నాడు హైద్రాబాద్ ఎంసీహెచ్ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖల 2020-21 వార్షిక నివేదిక విడుదల చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకత కోసమే వార్షిక నివేదిక విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ దార్శనికత వల్ల దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందన్నారు. టీఎస్ఐసీసీ కొత్తగా ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. సీఎం కేసీఆర్ విధివిధానాలు, సమష్టి కృష్టితోనే ఈ రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందన్నారు. 2019-20లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు అని.. అదే 2020-21లో రూ.1.45 లక్షల కోట్లు అని తెలిపారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామని తెలిపారు. ఐదేళ్లుగా తన శాఖల వార్షిక నివేదికలను కేటీఆర్ విడుదల చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఏడేళ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపు అయిందని వివరించారు. రాష్ట్ర ఐటీ రంగం 6.28లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. 20 లక్షల మందికి పైగా ఐటీ రంగంపై ఆధారపడి పని చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఐటీ, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే రాష్ట్రంలో సమర్థ బృందం కృషి ఫలితం ఉందన్నారు. ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. టీ హబ్ ఫేజ్-2 బిల్డింగ్‌ను తర్వలో ప్రారంభిస్తామన్న కేటీఆర్.. టీ వర్స్క్‌ను ఈ ఏడాది లాంఛనంగా ఆవిష్కరిస్తామన్నారు.
IT and Industries Minister @KTRTRS highlighted the growth story of Industries Dept and IT, E&C Dept. after the launch of the Annual Reports. pic.twitter.com/UlxUNXm5Dk
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 10, 2021
ఇదిలావుంటే, కరోనా నేపథ్యంలోనూ పారిశ్రామికంగా కూడా గణనీయ అభివృద్ధి సాధించామన్నారు. 2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లు. వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించాం. దేశ తలసరి ఆదాయం రూ.1,27,768 కాగా.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కేంద్రం ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. రూ.20 లక్షల కోట్లు ఉద్దీపన ప్యాకేజీ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ అన్నారు.