
వేటకు వెళ్లిన వ్యక్తి అనుకోకుండా గుహలో ఇరుక్కుపోయాడో వ్యక్తి. 36 గంటలకు పైగా నరకయాతన అనుభవిస్తున్నాడు. పోలీసులు జేసీబీల సాయంతో రాళ్లను తొలగించేందుకు రెండు రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు కాని ఇప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో వెలుగు చూసింది. మంగళవారం అంటే డిసెంబర్ 13న సాయంత్రం కామారెడ్డి రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు ఘన్‌పూర్ శివారులో వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన సెల్‌ఫోన్ కింద పడిపోవడంతో తీసేందుకు ప్రయత్నించడంతో గుహలో మరింత లోతుకు వెళ్లి ఇరుక్కుపోయాడు.
ఆ సమయంలో అతడితో పాటు మహేశ్ అనే మిత్రుడు కూడా ఉన్నాడు. మంగళవారం ఎంత ప్రయత్నించినా రాజు బయటకు రాలేకపోయాడు. నిన్న కూడా కొందరు గ్రామస్థులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు జేసీబీల సాయంతో రాళ్లను తొలగించేందుకు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని జేసీబీలు, కంప్రెషర్లు తెప్పిస్తున్నారు. రాత్రి కూడా సహాయక చర్యలు కొనసాగాయి. అయితే రాజుని బయటకు తీయడం పోలీసులకు పెద్ద టాస్క్‌గానే మారింది. రాజు రెండు రాళ్ళ నడుమ నుంచి లోపలికి జారిపడటంతో అతణ్ని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది.
జేసీబీలు తీసుకొచ్చి తాళ్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ రాజు బయటకు రాకపోవడం.. చీకటి పడుతుండటంతో అక్కడికి సహాయక చర్యలు నిలిపివేశారు. ఈరోజు తెల్లవారుజామునుంచి మళ్లీ సహాయక చర్యలు ప్రారంభించారు. వీలైనంత త్వరగా.. ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజు తలక్రిందులుగా ఎక్కువ సేపు ఉండడం అంత సేఫ్ కాదంటున్నారు డాక్టర్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..