Rajashyamala Yagna: ఢిల్లీలో కేసీఆర్ రాజ శ్యామల యాగం.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసమే యాగమని ప్రచారం.. ఈ యాగాన్ని ఎందుకు చేస్తారో తెలుసా..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా రాజ శ్యామల యాగం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్‌లో రాజ శ్యామల యాగం చేసిన కేసీఆర్, ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు.
రాజశ్యామల యాగం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన యాగం. ఈ యాగం చేస్తే రాజ్యాధికారం సొంతమవుతుందని.. శత్రువుల మీద విజయం సాధిస్తారని పండితులు చెబుతారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ వల్లనే ఈ యాగం బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణాకు కేసీఆర్ సీఎం కాగానే యాగాలు, హోమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల యాగం భారీ ఎత్తున చేయించారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యాగం చేయించారు. ఇంతకీ రాజశ్యామల యాగం అంటే ఏంటి. ఇది ఎందుకు చేస్తారు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి తెలుసుకుందాం..
మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యాగాలు జరిగాయి. యజ్ఞం లేదా యాగం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవి దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరతాయని అంటారు . యుద్ధాల్లో విజయం సిద్ధిస్తుందని చెబుతారు. ఇప్పటి కాలంలో యుద్ధమంటే ఎన్నికలనే చెప్పుకోవచ్చు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన మాజీ ముఖ్యమంత్రులలో కూడా కొందరికి దైవ భక్తి విశేషంగా ఉండేది. ఎన్టీఆర్ తాను స్వయంగా కాషాయ వస్త్రధారిగా నిలిచి ఆకట్టుకున్నారు.
ఆ మధ్య విశాఖలోని శారదాపీఠంలో రాజ శ్యామలా యాగం అయిదు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలి రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి యాగం విజయవంతంగా పూర్తి అయిందని, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతోనే దీనిని నిర్వహించామని స్వరూపానందేంద్ర అప్పట్లో వివరించారు. తెలుగు రాజకీయాలలో భారీ మార్పులను తీసుకువచ్చిన ఘనత ఈ యాగానికి ఉందని అప్పట్లో ఆయన చెప్పడం విశేషం.
ఢిల్లీలో రాజశ్యామల యాగం
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం చేశారు. కొత్తగా జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం కోసమే ఈ యాగం చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే..పురాణాల్లో చేసిన రాజసూయ యాగం-రాజకీయ నాయకులు నిర్వహించే రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా అంటే పెద్దగా తేడా లేదు. మొదటిది అధికారం శాశ్వతంగా ఉండటానికి .. రెండోది విజయ కాంక్షతో చేసేదని పండితులు చెబుతున్నారు.
రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేదే రాజసూయ యాగం
సూయం అంటే శాశ్వతం రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేది కనుకే రాజసూయ యాగం అంటారు. తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగం ఇది. రాజసూయ యూగం చేస్తే శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సాహాసించలేడని అంటారు. పూర్వ కాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు పురోహితులతో రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారు. విజయాలు సాధించేవారు. చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు రాజశ్యామల యాగం చేశారు. తన అధికారం పదిలపరచుకునేందుకు ఆ చక్రవర్తి రాజశ్యామల యాగం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత దక్షిణ భారతదేశంలో ఇంకెవరూ రాజశ్యామల యాగం చేసిన దాఖలాలు లేవు.
కేసీఆర్‌కు దైవభక్తి మెండు
తెలంగాణ సీఎం కేసీఆర్ కి దైవభక్తి చాలా ఎక్కువ. ఉద్యమకాలంలో అనేక యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయుత చండీ యాగం నిర్వహించి దేశవ్యాప్తంగా కేసీఆర్ యాగాలపై చర్చ మొదలయ్యేలా చేశారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిష్టతో నిర్వహిస్తారు కేసీఆర్. ఇక, దైవదర్శనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలన్నీ దాదాపు దర్శించుకున్నారు. కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని 2019 ఎన్నికల ముందు వివిధ పార్టీల నేతలు కూడా యాగాలు చేయించారు. కేసీఆర్ రెండోసారి సీఎం గా అధికారంలోకి రావడంతో రాజశ్యామల యాగం విశిష్టత అందరికీ తెలిసి వచ్చింది. ఈ యాగంపై చర్చ కూడా పెరిగింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికే యాగమా..?
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా రాజ శ్యామల యాగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్ తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించడంతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి కలిసొచ్చే పార్టీలతో మంతనాలు జరుపనున్నారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా రాజ శ్యామల యాగం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్‌లో రాజ శ్యామల యాగం చేసిన కేసీఆర్, ఎన్నికల విజయం తరువాత సహస్ర చండీ యాగం చేశారు. కేసీఆర్ ఏ పని చేసినా సరే యజ్ఞాలు, యాగాల సెంటిమెంట్ కనిపిస్తుంది. అది ఆయనకు కలిసొస్తోంది. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ 12 మంది రుత్విక్కులతో సీఎం కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారు. యాగమంతా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా జరిగింది.
ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, మండలం రోజులు అంటే 41 రోజులు చేయొచ్చు..ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు చేస్తారు. యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధారపోస్తారు. ధర్మరాజుతో కృష్ణుడు చేయించిన యాగం ఇది. మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన. శత్రు క్షయాన్నీ, కీర్తినీ, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీ కృష్ణుడు సూచించాడు. మయసభలో దుర్యోధనుడి పరాభవం – మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది. యాగం పూర్తైన తర్వాత శిశుపాలుడి వధ జరిగిందీ ఇక్కడే అంటే యాగం పూర్తైన వెంటనే శత్రు సంహారం జరిగిందన్నమాట..
ప్రస్తుత రాజకీయాల్లో.. రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలవాలని..చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. కేసీఆర్ కూడా యాగం చేసిన ప్రతిసారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు బి ఆర్ ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మళ్లీ రాజ శ్యామల యాగం చేశారు..కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని..ఈ సారికూడా రాజ శ్యామల యాగం ద్వారా జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పార్టీ వర్గాల విశ్వాసం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..