Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మే నెలలో మద్యం ధరల పెంపు..!
తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్ తప్పదా? గాజు సీసాల కొరత, అంతర్జాతీయ ప్రభావాలు కలిసి మద్యం, బీర్ల ధరల పెంపుకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మే నెలలోనే కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో మందుబాబుల జేబుపై భారం పడనుంది.

తెలంగాణలో మద్యం ప్రియులకు ఈ వేసవిలో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మద్యం, బీర్ల ధరలు మే నెలలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఉత్పత్తి సమస్యలు కలిసి ధరల పెంపుకు దారితీస్తున్నాయి.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం నేరుగా మద్యం పరిశ్రమపై పడుతోంది. ముఖ్యంగా సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గాజు సీసాల తయారీ తీవ్రంగా దెబ్బతింది. దీంతో సీసాల కొరత పెరిగి, తయారీ ఖర్చులు బాగా పెరిగాయి.దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి చాలా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడగా, మరికొన్ని ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు కూడా పెరిగి కంపెనీలపై అదనపు భారం పడుతోంది.
ఇక రాష్ట్రంలో మద్యం ధరల సమీక్ష గడువు పూర్తవ్వడం మరో కీలక కారణంగా మారింది. గతసారి 2023 మేలో ధరలు సవరించగా, ప్రస్తుతం కొత్త రివ్యూకు సమయం దాటిపోయింది. దీంతో ధరల పెంపు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.తయారీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించి 12 నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని కోరాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని తాము భరించలేమని స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం జ్యుడీషియల్ కమిటీని నియమించింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిటీ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషిస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా మేలో కొత్త ధరలు ప్రకటించే అవకాశం ఉంది.
మద్యం ధరలను స్లాబ్ విధానంలో పెంచే ప్రణాళికపై కూడా చర్చ జరుగుతోంది. బాటిల్ పరిమాణం, బ్రాండ్ కేటగిరీ, ధర శ్రేణులను ఆధారంగా చేసుకుని విభజించి పెంపు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీర్ల విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ధరలు పెరిగినప్పటికీ, ప్రస్తుతం క్యాన్ల ధరలు పెరగడం, వేసవిలో డిమాండ్ అధికం కావడం వల్ల మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉంది. సరఫరా తగ్గడం కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతోంది.
మద్యం రంగం రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండగా, ఈ పరిణామాలు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరఫరా సమస్యలు కొనసాగితే బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, అంతర్జాతీయ ప్రభావం రాష్ట్రంలోని మందుబాబుల జేబుపై నేరుగా పడబోతోంది.
Also Read: ఏపీలో ‘అడవి ఆవులు’ నిజంగా ఉన్నాయా..? అవి ఎక్కడి నుంచి వచ్చాయి..
